ఇంత దారుణమైన సీఎంని ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

Chandrababu: తాను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ, జగన్ లాంటి దారుణమైన సీఎంని ఎప్పుడూ చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Courtesy: Top Indian News

Share:

తాడేపల్లి: తాను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ, జగన్ లాంటి దారుణమైన సీఎంని ఎప్పుడూ చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంతేకాకుండా, గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరముందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. చంద్రబాబు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, ఇంత దారుణమైన సీఎంని, పాలనను ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చినా.. అభివృద్ధి మాత్రం కుంటుపడింది. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. పాఠశాలల భవనాలకు రంగులు వేయడమే అభివృద్ధి కాదు. అందులో చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తే.. అదే నిజమైన విద్యాభివృద్ధి. తెదేపా హయాంలో 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. కానీ, వాటన్నింటినీ వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఆర్థిక సాయం చేసిన పార్టీ తెదేపా.’’ అని చంద్రబాబు విమర్శించారు.

వైకాపా నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
‘‘ఎమ్మెల్యేలను బదిలీ చేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైకాపా నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే మీరు, మీ ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తోంది? ఎవరికి కావాల్సింది వారు దోచుకుతిన్నారు. ఇప్పుడేమో సర్వేల పేరుతో నాటకాలాడుతున్నారు. రాష్ట్రానికి జగన్‌ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇసుక, మద్యం దందాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. ప్రజా వ్యతిరేకత రాగానే ఎమ్మెల్యేలను మారుస్తున్నారు.’’ అని చంద్రబాబు విమర్శించారు.

‘‘జగన్‌.. రాజధాని మార్చలేవు, విశాఖపట్నం వెళ్లలేవు. ఏప్రిల్‌ తర్వాత తెదేపా ప్రభుత్వమే వస్తుంది. మంచికి.. చెడుకీ తేడా తెలియని వ్యక్తి జగన్‌. తెదేపా-జనసేన అధికారం కోసం ప్రయత్నించడం లేదు. 5కోట్ల మంది ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జగన్‌ రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేది కాదు. పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా గందరగోళంలోకి నెట్టారు’’ అని చంద్రబాబు విమర్శించారు.