బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షాక్.. తనయుడి ర్యాష్ డ్రైవింగ్ కేసులో షకీల్ పేరు

BRS former MLA Shakeel: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో  షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

Courtesy: IDL

Share:

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు షాక్ తగిలింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో  షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. షకీల్‌ కుమారుడు సాహిల్ గత నెల కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నుంచి సోహెల్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌కు నోటీసులు జారీ చేశారు. 

తన కొడుకు  సోహెల్ దుబాయ్  పారిపోయేందుకు షకీల్ సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. సోహెల్ దుబాయ్ కు పారిపోయేందుకు పది మంది సహాయం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు రిమాండ్ కు తరలించారు. సోహెల్ ను  దుబాయ్‌ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.తాజాగా షకీల్‌తో పాటు మరో ఇద్దరిపైనా లుకౌట్‌ సర్క్యులర్ జారీ చేశారు.

కేసు విచారణ వాయిదా 
ప్రస్తుతం సోహెల్ దుబాయ్ లో ఉన్నాడు. అతడిని భారత్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో సోహెల్ ని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో సోహెల్ వేసిన క్వాష్ పిటిషన్‌ పై విచారణ జరిపిన కోర్టు అతడిని అరెస్ట్ చేయద్దని సూచించింది. ఈనెల 17న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సోహెల్ ని ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 24కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.

అసలేం జరిగిందంటే
2023 డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి 2.45 గంటలకు ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను సోహెల్​ కారు ఢీకొట్టింది. పంజాగుట్ట పోలీసులు వెంటనే స్పాట్​ కు చేరుకున్నారు. కారు నడిపింది మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్​ గా గుర్తించారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్ ​కు తీసుకెళ్లారు. షకీల్ అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్​ కు వచ్చినట్లు సమాచారం. సోహెల్​ ను కేసు నుంచి తప్పించి.. అతని ఇంట్లో పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్​ ను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేశారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ ​కు తీసుకెళ్తున్న టైమ్​ లో సోహెల్ పారిపోయాడని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో వారికి సీఐ దుర్గారావు సహకరించినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న విషయం సీపీ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఎంక్వైరీ చేశారు. ప్రజాభవన్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. స్టేషన్ ​లోని కెమెరాలను చూశారు.