2 సార్లు డ్రా.. 2 సూపర్ ఓవర్లు.. ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం!

IND vs AFG 3rd T20: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.

Courtesy: IDL

Share:

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మ్యాచ్ డ్రా కావడంతో రెండు సార్లు సూపర్ ఓవర్ల అనంతరం అఫ్గానిస్థాన్ పై ఎట్టకేలకు భారత్ అద్భుత విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి పోరులో భారత్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా విజయం సాధించి 3-0తో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. గత రెండు మ్యాచుల్లో పరుగులు చేయకుండానే ఔట్ అయి అభిమానులను నిరాశ పరచిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏకంగా 121 పరుగులు చేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు. 

ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. తొలుత  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. కీలకమైన బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ కెప్టెన్ రోహిత్ శర్మ (121)(69 బంతుల్లో 121 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు)అద్భుతమైన శతకంతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు, రింకూ సింగ్(69)(39 బంతుల్లో 69 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) సైతం అర్ధశతకంతో అదరగొట్టాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, అజ్మతుల్లా ఒక వికెట్ పడగొట్టాడు. 

213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు సైతం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రెహ్మతుల్లా గుర్బాజ్(50), ఇబ్రహీం(50), గుల్బాదిన్ నయీబ్(55) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల స్కోరూ సమం కావడంతో మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. తొలి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 16 పరుగులు చేయగా, భారత్ సైతం 16 పరుగులే చేసింది. ఫలితంగా సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ డ్రా అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లారు. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. 11 పరుగులు చేసింది. అఫ్గాన్ 12 పరుగులు చేయాల్సి ఉండగా, ఒక పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో రెండో సూపర్ ఓవర్లో భారత్ విజేతగా నిలిచింది.

రోహిత్ రికార్డు
ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20ల్లో 5 శతకాలు బాదిన తొలి బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ తర్వాత భారత ప్లేయర్ సూర్యకుమార్(4), ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్(4), చెక్ రిపబ్లిక్ బ్యాటర్ సబవూన్(3), న్యూజిలాండ్ ప్లేయర్ కొలిన్ మున్రో(3) ఉన్నారు.

తొలి సూపర్‌ ఓవర్‌
అఫ్గాన్‌: 1+వికెట్‌,1,4,1,6,3
భారత్‌: 1,1,6,6,1,1,

రెండో సూపర్‌ ఓవర్‌
భారత్‌: 6,4,1,వికెట్‌, వికెట్‌
అఫ్గాన్‌: వికెట్‌,1, వికెట్‌