అసోంలో పిక్నిక్ వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. 14 మంది మృతి

Assam Road Accident: అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు మృతి చెందగా, 27 మందికి పైగా గాయపడ్డారు.

Courtesy: IDL

Share:

గువహటి: అసోం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు మృతి చెందగా, 27 మందికి పైగా గాయపడ్డారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న గోలాఘాట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం 5 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని  గోలాఘాట్ జిల్లా ఎస్​పీ రాజేన్ సింగ్  వివరించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్​పీ రాజేన్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ప్రమాదానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ప్రమాదానికి గురైన లారీ బొగ్గు లోడుతో వెళ్తున్నట్లు సమాచారం. 27 మంది క్షతగాత్రులు జొర్హాట్ బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అక్కడి సీనియర్ వైద్యుడు తెలిపారు. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.

స్థానిక పోలీస్ స్టేషన్​లోని ఓ అధికారి సమాచారం ప్రకారం బస్సు గోలాఘాట్​లోని కమార్​గావ్ నుంచి తీన్​సుకియాలోని తిలింగ మందిర్ ​కు వెళ్తోంది. 'బస్సులోని ప్రయాణికులు పిక్నిక్​ కోసం అక్కడికి బయల్దేరారు. ట్రక్కు జొర్హాట్ వైపు నుంచి వస్తుండగా ఘటన జరిగింది. ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్​లో నడిపాడు. నాలుగు లేన్ల రహదారి కాస్త దెబ్బతినడం వల్ల ట్రక్కు రాంగ్ రూట్​లో వచ్చింది. బస్సు సరైన మార్గంలోనే ఉంది. రెండు వాహనాలు హైస్పీడ్​లోనే ఉన్నాయి. భారీగా పొగమంచు కూడా ఉంది' అని అధికారి వివరించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.