బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్ల రాజీనామా.. బెల్లంపల్లిలో హీటెక్కిన రాజకీయం!

BRS: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారింది.

Courtesy: IDL

Share:

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారింది.  బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు భారత రాష్ట్ర సమితి(BRS)కి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది. 21 మందిలో  19 మంది సంతకాలు చేసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ కి రాజీనామా లేఖ ని పంపించినట్లు తెలుస్తోంది. సంతకాలు చేయనప్పటికీ వైస్ చైర్మన్ సుదర్శన్ తో పాటు 14వ వార్డు కౌన్సిలర్ బొడ్డు నారాయణ సైతం రాజీనామా కి ఒప్పుకున్నట్లు సమాచారం. 

బెల్లంపల్లికి చెందిన 18 మంది భారత రాష్ట్ర సమితికి చెందిన కౌన్సిలర్లు వారం క్రితం  బస్సులో శిబిరానికి తరలి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారంతా రాజీనామా నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగాల్సి ఉంది. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వీటిలో ఒక వార్డు కౌన్సిలర్‌ గతంలో మృతి చెందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 11 మంది, భాజపాకు ఒకరు మద్దతు ఇస్తున్నారు. భారాసకు చెందిన 21 మంది రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే జిల్లా కలెక్టర్ సంతోశ్ ఈ నెల 12న అవిశ్వాసానికి సంబంధించి సమావేశం నిర్వహించడానికి, కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మద్దతు కోసం, ప్రస్తుత ఛైర్మన్‌ జక్కుల శ్వేత తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు హస్తం పార్టీ మరో వర్గం తమలోని ఇద్దరు కౌన్సిలర్లను ఛైర్‌పర్సన్‌, వైస్ ఛైర్‌పర్సన్‌లుగా చేయడానికి పావులు కదుపుతున్నారు. ఫలితంగా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు చాలా మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు రాజకీయంగా ఆ పార్టీకి దడ పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో పట్టు నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.