దేశంలో ఒకే రోజులో 797 కొత్త కరోనా కేసులు.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు!

Covid-19 Update: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా (Coronavirus) మహమ్మారి చాపకింద నీరులా పాకుతోంది.

Courtesy: IDL

Share:

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా (Coronavirus) మహమ్మారి చాపకింద నీరులా పాకుతోంది. రోజూ వారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 800కు చేరువలో నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 797 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఐదు మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కారణమని తెలుస్తోంది.

మరోవైపు దేశంలో కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకూ 157 జేఎన్‌.1 కేసులు బయటపడ్డాయి. అందులో అత్యధికంగా కేరళలో 78 కేసులు వెలుగుచూశాయి. గుజరాత్‌లో 34, గోవాలో 18, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఢిల్లీలో ఒక కేసు నమోదైంది.

కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కరోనా నిర్ధారణ పరీక్షలను కూడా ప్రభుత్వాలు పెంచుతున్నాయి. కొన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించి అది ఏ రకం కరోనా వేరియంట్ అనేది కూడా నిర్ధారిస్తున్నారు.

తిరుపతిలో నలుగురికి కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా మరో ఎనిమిది పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. కృష్ణా జిల్లాలో నలుగురికి, తిరుపతిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40కు చేరింది. విజయవాడ సమీపంలోని కానూరులో రెండు కేసులు, గన్నవరం, మచిలీపట్నంలలో ఒక్కో కేసు నమోదయ్యాయి. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో నిర్వహించిన కొవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పొరుగు రాష్ట్రాల్లో బయటపడుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయాస్పత్రి, ఏరియా, ప్రాంతీయ వైద్యశాలల్లో కొవిడ్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుయాస్పత్రిలో గురువారం 20 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు చేశారు. నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.