గుర్రంపై స్వారీ చేసి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్!

Food delivery: మంగళవారం పెట్రోల్‌ కోసం బంక్‌ వద్ద లైన్‌లో నిలబడిన ఓ జొమాటో డెలివరీ బాయ్‌.. ఇంధనం దొరకకపోవడంతో విసుగుచెంది వాహనాన్ని పక్కనపెట్టాడు. అనంతరం గుర్రంపై వెళ్లి ఆహారాన్ని అందించాడు.

Courtesy: x

Share:

హైదరాబాద్: ప్రస్తుతం అర్బన్ ఏరియాల్లో చాలా మంది ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అలవాటుగా మారింది. ఫుడ్ డెలివరీ యాప్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత కావాల్సిన ఫుడ్ ను ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకుంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడాలేకుండా ఎప్పుడూ ఫుడ్ డెలివరీ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ కష్టాలు అనేకం ఉంటాయి. కొన్నిసార్లు వాతావరణం అనుకూలించని సమయంలో కూడా నిర్దేశిత టైంకు ఫుడ్ ఆర్డర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తాజాగా జొమాటోకు చెందిన ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కు హైదరాబాద్ లో అదే పరిస్థితి ఎదురైంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ ఉన్నప్పటికీ, పెట్రోల్ అందుబాటులో లేకపోవటంతో గుర్రంపై వెళ్లి కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హీట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యాజమానులు, డైవర్లు ధర్నా చేపట్టిన విషయం తెలిసింది. దీంతో పెట్రోల్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్ లో పలుప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. దీంతో మంగళవారం పెట్రోల్‌ కోసం బంక్‌ వద్ద లైన్‌లో నిలబడిన ఓ జొమాటో డెలివరీ బాయ్‌.. ఇంధనం దొరకకపోవడంతో విసుగుచెంది వాహనాన్ని పక్కనపెట్టాడు. అనంతరం గుర్రంపై వెళ్లి ఆహారాన్ని అందించాడు. ఇది హైదరాబాద్‌ చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో రోజువారి ఉద్యోగానికి వెళ్లేవారు, ఫుడ్ డెలివరీ బాయ్స్ పెట్రోల్ కోసం గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ ల వద్ద నో స్టార్ బోర్డులు దర్శనమిచ్చాయి.