Gang Rape: విశాఖలో దారుణం.. దళిత బాలికపై గ్యాంగ్ రేప్

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఒక దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాల చేతిలో బాలిక నరకాన్ని చవిచూసింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ దళిత బాలికకు ఈ పరిస్థితి ఎదురైంది.

Courtesy: x

Share:

వైజాగ్: ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఒక దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాల చేతిలో బాలిక నరకాన్ని చవిచూసింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన ఓ దళిత బాలికకు ఈ పరిస్థితి ఎదురైంది. 17 ఏళ్ల బాలికను వంచించి ప్రేమ పేరుతో ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తన మిత్రుడినీ ఉసిగొలిపాడు. మరో ఎనిమిది మంది బాలికను రెండు రోజులపాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తోంది. ఈ ఇంట్లోని బాలిక రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. బాలికకు భువనేశ్వర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయమేర్పడి ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడినీ రప్పించి అఘాయిత్యానికి పురమాయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్‌కు వెళ్లి ఏడుస్తున్న బాధిత బాలికపై పర్యాటకుల ఫొటోలు తీసే ఓ ఫొటోగ్రాఫర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి నగరంలోని జగదాంబ కూడలికి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. గదిలోనే బంధించి తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఫొటోగ్రాఫర్‌ సహా ఎనిమిది మంది ఈ దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజులపాటు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. 

కాగా బాధిత బాలిక లాడ్జి నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయింది. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులతో కూడా పంచుకోలేదు. అయితే విశాఖలో పనిచేసిన ఇంటివారు 18వ తేదీనే బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4వ పట్టణ స్టేషన్ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు. అప్పుడు బాలిక అసలు విషయాన్ని చెప్పింది. తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది.

తాను పడ్డ బాధలను ఆదివారం చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన ఎనిమిది మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఝార్ఖండ్‌, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. ఇక తొలుత అత్యాచారానికి పాల్పడిన ప్రియుడు, అతడి స్నేహితుడు పరారయ్యారని, ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఝార్ఖండ్‌, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారని సమాచారం.