విదేశీ మహిళపై చెయ్యేసి తాకుతూ, అనుచిత ప్రవర్తన.. యువకుడి అరెస్టు!

ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళా వ్లాగర్ భారత పర్యటనకు వచ్చింది. పర్యటనలో భాగంగా పుణెకు వెళ్లిన ఆ మహిళ పట్ల ఓ యువకుడు అనుచిత ప్రవర్తన చేశాడు. దీనిపై పుణెలోని పింప్రి చించ్‌వాడ్ పోలీసులు రంగంలోకి దిగి వెంటనే ఆ వేధించిన వ్యక్తిని తాజాగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Courtesy: x

Share:

విదేశీయులు మన దేశానికి పర్యటించడానికి వచ్చినపుడు ఇక్కడి ప్రజలు వారితో సరదాగా సెల్ఫీలు తీసుకోవడం మనం చూస్తుంటాం. కానీ, అది కాస్తా శ్రుతి మించి వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు మహారాష్ట్రలోని పుణెలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళా వ్లాగర్ భారత పర్యటనకు వచ్చింది. పర్యటనలో భాగంగా పుణెకు వెళ్లిన ఆ మహిళ పట్ల ఓ యువకుడు అనుచిత ప్రవర్తన చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పూర్తిగా చదవండి. 

దక్షిణ కొరియాకు చెందిన కెల్లీ అనే వ్లాగర్‌ ఇటీవల పుణెకు వచ్చింది. ఈ క్రమంలో పింప్రి చించ్‌వాడ్‌లోని రావెట్ ప్రాంతంలో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆమెకు ఓ వ్యక్తి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ సంఘటన నవంబర్‌లో దీపావళి నాడు చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోను కెమెరాలో బంధించి, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్‌గా మారడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వీడియో ఆలస్యంగా పోలీసుల ద్రుష్టికి చేరింది. దీనిపై పుణెలోని పింప్రి చించ్‌వాడ్ పోలీసులు రంగంలోకి దిగి వెంటనే ఆ వేధించిన వ్యక్తిని తాజాగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఏసీపీ సతీష్ మానె తెలిపిన వివరాల ప్రకారం.. "దక్షిణ కొరియాకు చెందిన కెల్లీ అనే వ్లాగర్‌ స్థానికంగా ఓ వ్యక్తి నుంచి వేధింపులను ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓ వీడియో విస్తృతంగా ప్రచారం అయింది. మాకు ఆ వైరల్ అయిన వీడియో ద్వారా వేధింపుల విషయం తెలిసింది. ఆ వీడియోలో నిందితుడు కెల్లీ పైన చేతులు వేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం గమనించాం. తద్వారా నిందితుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకునేందుకు మేం సిద్ధమయ్యాం" అని తెలిపారు. ఈ క్రమంలోనే  పింప్రి చించ్వాడ్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ రావెట్ ప్రాంతంలో అనుమానితుడిని ట్రాక్ చేసి మంగళవారం అరెస్టు చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. కెల్లీ స్థానికంగా  కొబ్బరి నీళ్లు తాగుతూ దుకాణదారులు మరియు కస్టమర్లతో సంభాషిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. అకస్మాత్తుగా, ఒక వ్యక్తి వచ్చి ఆమెను పట్టుకుని, ఆమె మెడ చుట్టూ చేయి వేస్తాడు. అంతటితో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు తాకుతూ ప్రవర్తించడం చేస్తాడు. ఇంతలో రెండో వ్యక్తి వచ్చి అదే తరహాలో ప్రవర్తిస్తాడు. కెల్లీ తనను తాను దూరం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఓ వ్యక్తి ఆమెని అసౌకర్యానికి గురిచేస్తూనే ఉన్నాడు. క్లిప్‌లో, ఆమె ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, "నేను ఇక్కడి నుండి పారిపోవాలి" అని పేర్కొంటుంది. 

గతంలోనూ ఈ తరహా ఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నారు. పలువురు విదేశీ వ్లాగర్లను వేధించిన విషయమై పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. గతేడాది ముంబైలోనూ ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. ముంబైకి వచ్చిన ఓ దక్షిణ కొరియా వ్లాగర్ కు వేధింపులు ఎదురవగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.