రోడ్డుపై ట్రాఫిక్ ఉందని, నదిలో కారు డ్రైవింగ్.. ఏం జరిగిందో చూడండి!

ట్రాఫిక్ బారిన పడకుండా ఉండేందుకు ఏకంగా నదిలోనే కారు ప్రయాణం సాగించాడు ఓ ఘనుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా, ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జాగ్రత్త చర్యలు ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించారు.

Courtesy: x

Share:

అసలే ఏడాదిలో చివరి వారం, అందులోనూ వరుస సెలవులు కావడంతో అందరూ ట్రిప్ లకు ప్లాన్ చేసుకుంటున్నారు. వీటికి తోడు నూతన సంవత్సర వేడుకలు కూడా ఉండటంతో ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. అయితే, ట్రాఫిక్ బారిన పడకుండా ఉండేందుకు ఏకంగా నదిలోనే కారు ప్రయాణం సాగించాడు ఓ ఘనుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా, ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జాగ్రత్త చర్యలు ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించారు. 

హిమాచల్‌ ప్రదేశ్‌లోని లహాల్‌ వ్యాలీలో గల చంద్రా నదిలో నుంచి కొందరు ప్రయాణికులు సోమవారం సాయంత్రం థార్‌ ఎస్‌యూవీలో ప్రయాణించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నదిలో నీటి మట్టం తక్కువగా ఉండటంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, పర్యాటకుల తీరుపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో స్పందించిన పోలీసులు ఆ వాహనానికి చలానా వేశారు. దీనిపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ.. చంద్రా నదిలో థార్‌ వాహనాన్ని డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లిన ఘటన మా దృష్టికి వచ్చింది అని తెలిపారు. సదరు వాహనంపై చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. నదీ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరించామని వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. చివరకు పోలీసుల వరకూ చేరడంతో వారు సీరియస్‌గా స్పందించారు. నదిలో ప్రయాణించి కారుకి చలానా వేశారు.


క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకల వేళ హిమాచల్‌ ప్రదేశ్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో మనాలి, అటల్‌ టన్నెల్‌ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పొగమంచు కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు కొన్నిగంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. గత మూడు రోజుల్లో అటల్‌ టన్నెల్‌ మార్గంలో దాదాపు 55వేల వాహనాలు ప్రయాణించాయని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఈ వారంలో మరో లక్షకు పైగా వాహనాలు శిమ్లాకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు స్పందిస్తూ.. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.