Ayodhya: రామ్ చరణ్, సచిన్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖులకు అయోధ్య ఆహ్వానం!

Actor Ram charan: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది.

Courtesy: x

Share:

అయోధ్య: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. అయితే, రామాలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. సినీ, రాజకీయ, కళాకారులు, సాధువులు ఇలా దేశ ప్రముఖుల అందరికీ పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందాయి. శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర సుమారు 8 వేల మందిని ఈ వేడుక‌కు ఆహ్వానించింది. తాజాగా టాలీవుడ్ కు చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం అందింది. ఆరెస్సెస్‌ నేత సునీల్‌ అంబేద్కర్‌..హైదరాబాద్‌లోని రామ్‌చరణ్‌ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు.

చరణ్ కి కూడా ఆహ్వానం అందడంతో, మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కాగా, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీల నుంచి సూపర్ స్టార్  రజనీకాంత్‌, చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, కంగనా రనౌత్‌, జాకీ ష్రాఫ్‌, టైగర్‌ ష్రాఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ సహా పలువురికి ఆహ్వానాలు అందాయి.

సచిన్ తెందుల్కర్ కు కూడా
మాజీ క్రికెట‌ర్ స‌చిన్‌కు కూడా ఆహ్వానం అందింది. ఇవాళ ఆయ‌నకు ఆ ఆహ్వాన లేఖ‌ను అంద‌జేశారు. శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర సుమారు 8000 వేల మందిని ఈ వేడుక‌కు ఆహ్వానించింది. ఆ జాబితాలో క్రికెట‌ర్లు స‌చిన్‌, విరాట్ ఉన్నారు. బాలీవుడ్ హీరో అమితాబ్ బ‌చ్చ‌న్‌, అక్ష‌య్ కుమార్‌, వ్యాపార‌వేత్త‌లు ముఖేశ్ అంబానీ, ర‌త‌న్ టాటా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సుదరంగా అయోధ్య నగరం
రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను, అయోధ్య బైపాస్‌తో కలిపే ‘ధర్మమార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు.

విదేశాల్లో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సంబరాలు 
టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ మరియు జార్జియాలో ఇతర రాష్ట్రాలలో బిల్‌బోర్డ్‌లు ఏర్పాటయ్యాయి. జనవరి 15, సోమవారం నుండి రామ్ ఆలయంలో 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకను జరుపుకోవడానికి అరిజోనా మరియు మిస్సౌరీ నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. “జీవితకాలంలో ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో హిందూ అమెరికన్లు ఉల్లాసంగా మరియు ఆనందంగా పాల్గొంటున్నారు. విగ్రహ ప్రతిష్ట జరిగే పవిత్రమైన రోజు కోసం హిందూ అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వారి భావోద్వేగాలు పొంగిపొర్లుతున్నాయి” అని అమెరికా హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ అమితాబ్ మిట్టల్ అన్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’కు ముందు హిందూ ప్రవాసులు కారు ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు.

మాట నిలబెట్టుకున్న హనుమాన్ మూవీ మేకర్స్
మరోవైపు హనుమాన్‌ మేకర్స్ రామునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది. అలాగే సినిమా ప్రదర్శితమైనన్ని రోజులు ప్రతి టికెట్‌కు రూ.5 చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు తెలియజేశారు.

అయోధ్య నగరంలో భారీగా భద్రతా ఏర్పాట్లు
అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ శాఖ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. అయోధ్యలో కార్యక్రమం దేశానికి చాలా కీలకమైన రోజని.. ఇందుకోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పెషల్‌ డీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే 22న, ఆ తర్వాత నుంచి రాముడి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అయోధ్యలో 10వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నగర భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు.