"సర్పంచ్ గా పోటీ చేద్దామనుకుంటున్నా.. ఏమంటావ్", తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిసాయో లేదో.. అప్పుడే పంచాయితీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. గ్రామ  పంచాయితీ పాలకవర్గాల గడువు వచ్చే నెల ముగుస్తుండడంతో గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల హడావుడి నడుస్తోంది.

Courtesy: Top Indian News

Share:

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిసాయో లేదో.. అప్పుడే పంచాయితీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. గ్రామ  పంచాయితీ పాలకవర్గాల గడువు వచ్చే నెల ముగుస్తుండడంతో గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. పల్లెల్లో ఉండే నేతలంతా పంచాయితీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో జిల్లా అధికారులు ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నం కావడంతో స్థానిక నేతలు  ప్రచారం షురూ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్​ పార్టీ ఆశావహుల్లో జోష్​ కనిపిస్తోంది. అధికారానికి దూరమైన బీఆర్ఎస్​ కూడా పంచాయితీల్లో పట్టు నిలుపుకునేందుకు  గట్టిగా ప్రయత్నించనుంది. మొత్తానికి ఇలా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయో లేదో అప్పుడే రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మళ్లీ మొదలైంది. 

అన్నా నేను పోటీ చేద్దాం అనుకుంటున్నా.. ఏమంటావ్!
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్నవారు తమ మద్దతుదారులను పిలుచుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు. "అన్నా.. సర్పంచ్ గా పోటీ చేద్దం అనుకుంటున్న ఏమంటావ్" అని సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. గ్రామ పెద్దలు, యువకులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు ఆశావహులు మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు పార్టీలు కూడా ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పెద్దల తీర్మానాల మేరకు ఎన్నికలు జరగనున్నాయి. 

ఇప్పటికే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు!
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకన్నాముందే ఆశావహులు ఇప్పటినుంచే తామంటే తాము బరిలో నిలుస్తున్నామంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటాపోటీగా ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంత ఖర్చయినా భరిస్తూ పోటీలో నిలిచి గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో రిజర్వేషన్లపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేదా కొత్త రిజర్వేషన్లు ప్రకటిస్తారనే దానిపై అయోమయం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్  ఆశావాహులు సర్పంచ్  అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతో 12,769 సీట్లలో సగం వారికే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్​ పార్టీ ఆశావహుల్లో జోష్​ కనిపిస్తోంది. అధికారానికి దూరమైన బీఆర్ఎస్​ కూడా పంచాయితీల్లో పట్టు నిలుపుకునేందుకు  గట్టిగా ప్రయత్నించనుంది. 

మొత్తం గ్రామ పంచాయితీల లెక్క ఇదీ..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. గత పంచాయితీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగాయి. ప్రస్తుత గ్రామ పంచాయితీ పాలకవర్గం పదవీకాలం 2024 జనవరి 31తో  ముగియనుంది. వరుసగా పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో ముందుగా పంచాయితీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు సామాజికవర్గాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సర్పంచుల పదవీకాలం జనవరి 31తో ముగుస్తున్నప్పటికీ మరో ఆరు నెలలు పొడిగించాలని వారు కోరుతున్నారు. 2019లో ఎన్నికలు నిర్వహించిన ఆరు నెలల తర్వాత సర్పంచులు, వార్డు సభ్యులకు చెక్ పవర్ ఆలస్యంగా ఇచ్చినందున ఆరు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సర్పంచులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు చాలా గ్రామాల్లో సర్పంచ్ లకు రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ బిల్లులు రావాల్సి ఉంది. ఇలా  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లకుపైనే బిల్లులు పెండింగ్  ఉన్నట్లు సమాచారం.