ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం

ESMA: గత కొద్ది రోజులుగా తమ డిమాండ్లు పరిష్కారించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది.

Courtesy: x

Share:

అమరావతి: గత కొద్ది రోజులుగా తమ డిమాండ్లు పరిష్కారించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీచేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తెస్తూ జీవో నంబర్‌.2ను విడుదల చేసింది. అదేవిధంగా సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. రూ.3 వేలు తగ్గించి రూ.8050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమచేసింది.

వేతనాల పెంపు సహా ఇతర సమస్యలపై గత 26 రోజులుగా (డిసెంబర్‌ 11 నుంచి) రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మె బాటపట్టారు. సమ్మెను విరమింప జేసేందుకు ప్రభుత్వం వారితో రెండు పర్యాయాలు జరిపిన చర్చలు విఫమయ్యాయి. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

మండిపడిన నారా లోకేష్
డిమాండ్లు పరిష్కారించాలని 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై సమ్మెపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని టీడీపీ జాతీయకార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) మండిపడ్డారు. అంగన్‌వాడీలు శాంతియుతంగా ఆందోళన చేయడం కూడా ఒక నేరమా అంటూ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘అమ్మనే గెంటేసిన వాడికి అంగన్‌వాడీల విలువ ఏం తెలుస్తుందని’ అన్నారు. అంగన్‌వాడీ వేతనాల్లో కోత విధించడం నియంత పోకడలకు నిదర్శనమని దుయ్యబట్టారు. అంగన్‌వాడీల సమ్మెను నిషేదిస్తూ తీసుకొచ్చిన జీవో 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. జగన్‌ అహంకారానికి, అంగన్‌వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్‌వాడీలదేనని అన్నారు.

‘ఎస్మా’ అంటే ఏంటి?
‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్‌ సర్వీసెస్‌ మెయిన్‌టీనెన్స్‌ యాక్ట్‌’. ఇది సమ్మెలు, హర్తాళ్లు వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా.. కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణకు బ్రేక్ కాకుండా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టమిది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.

ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?
ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే.. నేరశిక్షాస్మృతి(సీపీసీ)తో సంబంధం లేకుండానే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారూ శిక్షార్హులే. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.