ఏపీలో ఉద్ధృత రూపం దాల్చుతున్న అంగన్వాడీల ఉద్యమం!

Anganwadi Workers: ఏపీలో అంగన్వాడీల ఉద్యమం ఉద్ధృత రూపం దాల్చుతోంది. తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనంటూ ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

Courtesy: x

Share:

అమరావతి: ఏపీలో అంగన్వాడీల ఉద్యమం ఉద్ధృత రూపం దాల్చుతోంది. తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనంటూ ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం (23వ రోజు) కలెక్టరేట్ల ఎదుట బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమం పలుచోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరులో పోలీసుల అడ్డంకులను దాటుకొని అంగన్వాడీలు కలెక్టరేట్‌ల వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐదో తేదీలోగా విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు ఉత్తర్వులివ్వడం దుర్మార్గమని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

కాకినాడలో సీఎం పర్యటన.. రోడ్డుపై అంగన్వాడీల బైఠాయింపు
కాకినాడ కలెక్టరేట్‌ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నగరంలో ఇవాళ సీఎం జగన్‌ బహిరంగ సభ నేపథ్యంలో అంగన్వాడీలు కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 3 వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గణేష్ సర్కిల్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నుంచి చలో కలెక్టరేట్‌కు బయలుదేరిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రే అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతలకు నోటీసులు జారీ చేశారు. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికి వాటన్నింటినీ లెక్కచేయకుండా అంగన్వాడీలు కదంతొక్కారు.

స్పృహ తప్పి పడిపోయిన మహిళ
నిరసన కార్యక్రమం నేపథ్యంలో కొంతమంది అంగన్వాడీలు నిన్నరాత్రే విజయవాడకు వెళ్లి బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నారు. ఇవాళ ఉదయం మిగిలిన అంగన్వాడీలు నందిగామ నుంచి విజయవాడకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకొని ఠాణాకు తరలించారు. దీంతో పోలీసుస్టేషన్‌ వద్దే వారు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లనీయకుండా ప్రధాన గేటును పోలీసులు మూసివేశారు. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు చెందిన కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాలు, ఆటోల్లో చిల్లకల్లులోని కల్యాణ మండపానికి తరలించారు. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హుటాహుటిన జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. చిల్లకల్లు కూడలి, భీమవరం టోల్‌గేట్, గౌరవరం మార్గాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే అరెస్టులు చేయడం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.