అంగన్వాడీలకు షాకిచ్చిన ప్రభుత్వం.. 5వ తేదీలోపు విధుల్లో చేరాలని నోటీసులు

Anganwadi: ఏపీలో గత కొద్దిరోజులుగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది.

Courtesy: JBT

Share:

అమరావతి: ఏపీలో  గత కొద్దిరోజులుగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని..లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ‘ప్రభుత్వ విజ్ఞప్తి’ పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ జారీ చేసింది.

వేతనాల పెంపు, గ్యాట్యుటీ, ఇతర డిమాండ్లతో గత 22 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించమని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీల సమ్మెతో ఎదురవుతున్న ఇబ్బందులు, పూర్తి చేసిన హామీలతో ప్రభుత్వం నోట్ జారీచేసింది.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతోనే
అంగన్వాడీల సంఘాలతో ఇటీవల చర్చలు జరిపిన ప్రభుత్వ కమిటీ.. సంక్రాంతి వరకూ సమ్మె వాయిదా వేయాలని కోరింది. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని, అయితే ఇందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే 11 డిమాండ్‌లకు గాను నాలుగు డిమాండ్‌లను ప్రభుత్వం ఆమోదించి జీవో విడుదల చేసిందని కమిటీ తెలిపింది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్‌ జీతాల పెంపు, గ్రాట్యుటీల అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నారు. మినీ వర్కర్లను పూర్తి స్థాయి కార్మికులుగా పదోన్నతి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించి జీవో విడుదల కాకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నామని అంగన్వాడీ సంఘాలు తెలిపాయి. అంగన్వాడీలు పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించి వినతి పత్రాలను అందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను నిలదీస్తూ... తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు.

రేపు కలెక్టరేట్ల ముట్టడి
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్‌ల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయని సమాచారం. ప్రభుత్వం, అంగన్వాడీ సంఘాలతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది. అయితే సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అంగన్వాడీలు ఆందోళన ఉద్ధృతం చేస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అంగన్‌వాడీలకు అల్టిమేటం జారీచేసింది. జనవరి5 లోపు సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. సమ్మె వల్ల బాలింతలు, గర్భిణీలు, చిన్న పిల్లలు ఇబ్బందిపడుతున్నారని, ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని విధుల్లో చేరాలని కోరింది.