పవన్ కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడు: సీఎం జగన్ తీవ్ర విమర్శలు

AP CM Jagan: జగనన్న విద్యాదీవెన పథకం నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన‌ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

Courtesy: x

Share:

భీమవరం: "మ‌న రాష్ట్రంలో  పిల్లలు బాగా చదివి గొప్పగా ఎదగాలని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం" అని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన‌ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్ల నిధుల‌ను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం మాట్లాడారు.

ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం చెప్పారు. నేడు  8.09 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ జులై, ఆగస్టు, సెప్టెంబర్‌కు సంబంధించిన అక్షరాల రూ.583 కోట్లు నేరుగా జమ చేస్తున్నామని, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బందులు కలుగకూడదన్న ఉద్దేశంతో దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌ కూడా జమ చేశామని సీఎం తెలిపారు.

14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేయలేదు
ఈ నాలుగున్నరేళ్లలో 27.61 లక్షల మంది పిల్లలకు మేనమామగా ఈ ఒక్క పథకానికే  అక్షరాల రూ.11,900 కోట్లు ఇచ్చామని సీఎం సంతోషం వ్యక్తం  చేశారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఈ నాలుగున్నరేళ్లలో పిల్లల బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల పేరుతో డబ్బులు ఇస్తూ అండగా నిలిచామని, దీని కోసం మరో రూ.4,275 కోట్లు ఇచ్చామని, ఈ రెండు పథకాలకు రూ.16176 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెప్పారు. పేదవాళ్ల బతుకులు మారాలని, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలని, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని సీఎం ఆకాంక్షించారు. వీరు గొప్ప చదువులు చదివితే ఆ కుటుంబాల తల రాతలు మారుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ విద్యారంగంలోనే తీసుకువచ్చిన సంస్కరణలకు రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం తలిపారు. ఈ మార్పులు విద్యారంగంలోనే కాదు..వైద్యం, వ్యవసాయం, పరిపాలన సంస్కరణల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని, ప్రజలకు మంచి చేసేందుకు ఆ అధికారాన్ని ఉపయోగించలేదని, కేవలం తన  అవినీతి కోసమే ఉపయోగించాడని సీఎం విమర్శించారు. 

పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు
జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తాడని సీఎం జగన్ (CM Jagan) తీవ్ర విమర్శలు చేశారు. పెళ్లి అనే పవిత్ర సంప్రదాయం పక్కన పెట్టి.. కార్లు మార్చుతున్నట్టు భార్యలను మర్చుతున్న పెద్ద మనిషి గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు..ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు చేస్తే మన చెల్లెళ్ళు, అక్కల పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం జగన్‌. విలువలు, విశ్వసనీయత అసలు లేకుండా పరిపాలన చేసిన వాళ్ల గురించి ప్రజలు ఆలోచించాలి. భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు.. నాన్ లోకల్.. అని ఫైర్‌ అయ్యారు.