జమ్మూలో హై అలర్ట్, ఉగ్రవాదుల కోసం తీవ్రంగా కొనసాగుతున్న వేట

Army Chief Manoj Pandey: ఆర్మీ చీఫ్ (COAS) జనరల్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను సమీక్షించడంతో పాటు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలపై కూడా ఆయన చర్చిస్తారని రక్షణ వర్గాలు తెలిపాయి.

Courtesy: Top Indian News

Share:

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీలో ఇటీవల  ఆర్మీ వాహనాలపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ-పూంఛ్‌ జిల్లాల్లో మూడో రోజు కూడా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ఇక్కడ కూంబింగ్‌ ఆపరేషన్లను సైన్యం ముమ్మరం చేసింది. ముఖ్యంగా డేరా కి గలీ, బాఫియాజ్‌ ప్రాంతాలపై భద్రతా దళాలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ (COAS) జనరల్ మనోజ్ పాండే సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను సమీక్షించడంతో పాటు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలపై కూడా ఆయన చర్చిస్తారని రక్షణ వర్గాలు తెలిపాయి. 

జమ్మూలో హై అలర్ట్ 
ఇటీవల సైనిక వాహనాలపై ఉగ్రదాడి జరిగిన రాజౌరీ సెక్టార్‌లో నేడు ఆర్మీచీఫ్‌ మనోజ్‌ పాండే పర్యటించనున్నారు. ఈ ప్రాంతంలో సైన్యం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల తీరును ఆయన సమీక్షించనున్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికులకు ఆయన నివాళి అర్పించనున్నారు. ఇక జమ్మూలోని నగ్రోటలో ఆర్మీ వైట్‌నైట్‌ కోర్‌ ప్రధాన కార్యాలయంలో సమీక్ష జరపనున్నారు. ఏడాది వ్యవధిలోనే ఇక్కడ జరిగిన దాడుల్లో దాదాపు డజను మందికిపైగా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో కెప్టెన్‌, మేజర్‌ స్థాయి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్ సమీపంలోని బ్లైండ్ కర్వ్ వద్ద డిసెంబర్‌ 21న సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేసి నలుగురు సైనికులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆ ప్రాంతంలో ముగ్గురు పౌరులు సైనిక కస్టడీలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సైన్యం అంతర్గత దర్యాప్తు చేపట్టింది. కొందరు అధికారులపై చర్యలకు కూడా సిద్ధమైంది. సైన్యం చేపట్టిన దర్యాప్తు 72 గంటల్లో పూర్తికావాల్సి ఉంది. ఇక ఉగ్రదాడిలో మరణించిన సైనికులు వీరేంద్ర సింగ్‌, గౌతమ్‌ కుమార్‌ భౌతికకాయాలకు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ నివాళులర్పించారు. 


సరిహద్దును పటిష్టం చేస్తున్న సైన్యం
సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాలను నిరోధించేందుకు భారత సైన్యం నియంత్రణ రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రక్షణను మరింత పటిష్టం చేస్తోంది. భద్రతా బలగాలపై ఇటీవలి ఘోరమైన దాడుల నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు సైన్యం నడుం బిగించింది. చలికాలంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నందున, పరిస్థితి తీవ్రతరం కాకముందే అధికారులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.