కొడుకుతో భర్తను గడపమన్నందుకే హత్య.. కోర్టు ఆదేశాలపై మహిళా సీఈవో అసంతృప్తి!

Bangalore CEO mom : గోవాలో బెంగళూరుకు చెందిన ఓ మహిళా సీఈవో కన్న కొడుకుని దారుణంగా హత్య చేసిన కేసులో మరో మలుపు తిరిగింది.

Courtesy: PTI

Share:

పణజి: గోవాలో బెంగళూరుకు చెందిన ఓ మహిళా సీఈవో కన్న కొడుకుని దారుణంగా హత్య చేసిన కేసులో మరో మలుపు తిరిగింది. నిందితురాలు సుచనా సేథ్ ను మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర గోవా పోలీసు సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితురాలు సుచనా సేథ్, ఆమె భర్త 2022 నుంచి విడాకుల కోసం ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల తన భర్తను కుమారుడితో ఆదివారం రోజు గడపాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు విచారణలో గుర్తించినట్లు తెలిపారు. 

నిందితురాలు బాబును గొంతు నులిమి హత్య చేసినట్లు డాక్టర్ మీడియాకు తెలిపారు. నిందితురాలు బాబును చంపడానికి దిండు లేదా గుడ్డను ఉపయోగించినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కర్ణాటకలోని చిత్రదుర్గలో అతని తండ్రి వెంకట్ రామన్‌కు అప్పగించినట్లు చిత్రదుర్గలోని హిరియూర్‌ తాలూకా ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కుమార్‌ నాయక్‌ తెలిపారు. 

కొడుకుని చంపి సూట్ కేసులో పెట్టుకుని ప్రయాణించి
తన నాలుగేళ్ల కుమారుడిని ఓ మహిళా వ్యాపారవేత్త అతి దారుణంగా హత్య చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఎవరికీ అనుమానం రాకుండా ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచిపెట్టి.. గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అరెస్టు చేశారు. 

బెంగళూరుకు చెందిన సుచనా సేత్‌ ఓ స్టార్టప్‌ని స్థాపించి, సీఈవో గా వ్యవహరిస్తోంది. గత శనివారం ఆమె తన నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ఉత్తర గోవాలోని ఒక హోటల్‌కు వెళ్లింది. సోమవారం ఉదయం అక్కడ గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరింది. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తపు మరకలను గుర్తించారు.

అక్కడ రక్తపు మరకలు కనిపించడంతో హౌస్ కీపింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హోటల్ లోని  సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ముందుగా హోటల్ కు వచ్చినప్పుడు తన కొడుకుతో వచ్చిన సుచనా సేథ్.. వెళ్లేటప్పుడు ఒంటరిగా కనిపించింది. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో పోలీసులు ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్‌ చేసి సుచనాతో మాట్లాడారు. తన కుమారుడిని ఫ్రెండ్‌ ఇంటి వద్ద వదిలేసినట్లు చెప్పిన సుచనా సేథ్, ఇదే తన ఫ్రెండ్ అడ్రస్ అంటూ ఇచ్చింది. చివరకు ఆమె అబద్దాలు చెబుతుందని తేలడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీంతో కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. వారు క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసి కొంకిణి  భాషలో మాట్లాడుతూ కారును  చిత్రదుర్గలోని పోలీస్ స్టేషన్‌కు  మళ్లించమని చెప్పారు.  

చివరకు ఆమెను చిత్రదుర్గ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆమె తన కుమారున్ని ఎందుకు చంపింది అనే దానిపై కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.