ఇండియా కూటమి క‌న్వీన‌ర్‌గా నితీశ్ కుమార్? త్వరలోనే నియామకం?

I.N.D.I.A: బిహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) విప‌క్ష ఇండియా కూట‌మి క‌న్వీన‌ర్‌గా నియ‌మితుల‌య్యే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించారు.

Courtesy: Top Indian News

Share:

దిల్లీ: ఇండియా కూటమి క‌న్వీన‌ర్‌గా ఎవరనే విషయంపై ఆ కూటమి నేతలు త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) విప‌క్ష ఇండియా కూట‌మి క‌న్వీన‌ర్‌గా నియ‌మితుల‌య్యే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించారు. ఈ దిశ‌గా నిర్ణ‌యం తీసుకునేందుకు విపక్ష నేత‌లు ఈ వారంలో వ‌ర్చువ‌ల్‌గా భేటీ కానున్నార‌ని స‌మాచారం. ప్ర‌తిపాదిత నియామ‌కంపై కాంగ్రెస్ ఇప్ప‌టికే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్, నితీష్ కుమార్‌ల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డంతో పాటు ఇత‌ర భాగ‌స్వామ్య ప‌క్షాల‌నూ విశ్వాసం లోకి తీసుకున్న‌ట్టు తెలిసింది.

నితీష్ కుమార్ సైతం ఈ విష‌య‌మై శివ‌సేన (యూబీటీ) చీఫ్‌తో మంగ‌ళ‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ సైతం ఈ ప్ర‌తిపాద‌న‌కు అంగీక‌రించార‌ని స‌మాచారం. డిసెంబ‌ర్ 19న ఇండియా కూట‌మి పార్టీల నేత‌లు ఢిల్లీలో నాలుగో విడ‌త భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పేరును ప్ర‌తిపాదించారు.

ఈ స‌మావేశంలోనే విప‌క్షాలు సీట్ల స‌ర్ధుబాటు, ఉమ్మ‌డి ప్ర‌చారం, 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుస‌రించాల్సిన వ్యూహం స‌హా ప‌లు అంశాల‌పై సంప్ర‌దింపులు జ‌రిపాయి. ఇక గ‌త ఏడాది జులైలో బెంగ‌ళూర్‌లో జ‌రిగిన స‌మావేశంలో విప‌క్ష పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డ్డాయి.