కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్

BJP national general secretary Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Courtesy: x

Share:

కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చని.. అందుకోసం ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ పథకాన్ని రచించారని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోని ఎంపీ ఆఫీస్ లో మానకొండూరుకు చెందిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  తెలంగాణ అభివృద్ది కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరముందన్నారు.  బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని చెప్పారు.

కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చాలా మంది కేసీఆర్‌ తో  టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్‌ కోవర్టులున్నారని సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చే ప్రమాదముందని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా జరగొచ్చు అన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ అని చెప్పారు. ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోయారని.. ఆయన బయటకు వచ్చినా పట్టించుకునేదెవరు ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? స్పష్టత లేదని అన్నారు. కేసీఆర్‌ కుట్రలపై నిఘా ఉంచాలని కాంగ్రెస్‌ నేతలకు హితవు పలికారు. 

జాతీయ పార్టీ అన్నోళ్లు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలోనే బీఆర్ఎస్ కు క్యాండిడేట్లు దిక్కులేరని.. ఇగ దేశంలో యాడ దొరుకుతరని విమర్శించారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీనేనని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. రాష్ట్రానికి అప్పులు రావాలన్నా, అధిక నిధులు కావాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మోదీగారి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి నిధులు తీసుకొస్తాం. 

వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హితవు పలికారు. భారాసకు కేటీఆర్‌ అహంకారంతో నష్టం జరిగిందని.. కాంగ్రెస్‌కు పొన్నంతో నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య శ్రీరామని ప్రాణ ప్రతిష్టకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు తీసుకుపోలేదని, వేములవాడ అభివృద్దికి వందల కోట్లు కేటాయిస్తామన్నాడు, కానీ ఆచరణలో పెట్టలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కుట్రలను డేగ కన్నుతో గమనించి జాగ్రత్త పడాలని కాంగ్రెస్ నేతలకు సూచిస్తున్నానన్నారు. బీజేపీ ఆ కుట్ర రాజకీయాల జోలికి వెళ్లదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ పార్టీ ముందుంటుందని చెప్పారు.