BRS నేతలకు కేటీఆర్ కీలక సూచన.. లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు!

బీఆర్ఎస్ శ్రేణులు 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సన్నద్ధం కావాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌ను కేటీఆర్ ఆదేశించారు. ఎంపీ రంజిత్ రెడ్డి సహా చేవెళ్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో సోమవారం కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు.

Courtesy: IDL

Share:

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సన్నద్ధం కావాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని పార్టీ నేత‌ల‌ను కేటీఆర్ ఆదేశించారు. ఎంపీ రంజిత్ రెడ్డి సహా చేవెళ్ల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో సోమవారం కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. జ‌న‌వ‌రి 26వ తేదీలోగా స‌మావేశాలు పూర్తి చేసుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మితో కుంగిపోవ‌ద్ద‌ని, ప‌రాజ‌యం చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థులే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల‌ని, వారు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించాల‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 

చేవెళ్ల లోక్‌సభకు చెందిన నాయకులతో సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. నియోజక వర్గాల వారీగా మీటింగ్‌లు ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇంచార్జిలుగా ఉంటారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని కాపాడుకుంటూ, లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. బీజేపీ ధీటుగా ఉంటది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వారు కూడా పోటీ ఇస్తారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా ముందుకు సాగాలి’ అని అన్నారు.

స‌మీక్ష అనంత‌రం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..  ‘‘నన్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్‌ చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. భారాస ఖాళీ అవుతుందని కాంగ్రెస్‌, భాజపా చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని పార్టీ శ్రేణులకు రంజిత్‌రెడ్డి చెప్పారు. 

2019లో జరిగిన పార్లమెంట్ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి  తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో , భారతీయ జనతా పార్టీ  నాలుగు స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందింది. 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని  భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ పార్టీలు యోచిస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో  తెలంగాణ రాష్ట్రంలో  బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 39 స్థానాలు రాగా, కాంగ్రెస్ కు 64 స్థానాలు వచ్చాయి. భాజపాకు 8, ఎంఐఎంకు 7, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు.