భారాసను మళ్లీ తెరాసగా మార్చండి.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఆలోచనలు?

BRS senior leader Kadiam Srihari : ఎన్నికల సమయంలో దళితబంధు పథకాన్ని రెండు లక్షలు పెంచి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు.

Courtesy: x

Share:

వరంగల్: ఎన్నికల సమయంలో దళితబంధు పథకాన్ని రెండు లక్షలు పెంచి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్‌ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశం అనంతరం ఎంపీ పసునూరి దయాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్‌, బీఆర్‌ఎస్‌ నేత కే వాసుదేవరెడ్డితో కలిసి కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తుందా? చేయదా? అని కర్ణాటక పరిణామాలను చూస్తే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణలోనూ అదే పనిచేయబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తెలిపే షెడ్యూల్‌తో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, కనీస మద్దతు ధరతోపా టు ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌, 200 యూనిట్ల ఉచిత కరెంటు హమీల అమలు విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని.. కాలయాపన చేయటానికే శ్వేతపత్రాల విడుదల, ప్రజాపాలన దరఖాస్తు, వాటి క్రోడీకరణ, కంప్యూటీకరణ అంటూ నాటకాలాడుతున్నారు అని కడియం మండిపడ్డారు.

మరోవైపు మళ్లీ తెరాసగా మార్చాలని ?
భారత్‌ రాష్ట్ర సమితి ని తిరిగి తెరాసగా మార్చాలని ఆ పార్టీ శ్రేణులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. తాజాగా బుధవారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలోనూ భారాస సీనియర్‌ నేత కడియం శ్రీహరి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో దీనికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. "భారాసగా మారిన తర్వాత అంతగా కలిసిరాలేదనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు  ఎక్కువమంది కార్యకర్తలు, ప్రజలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తిరిగి తెరాసగా మారిస్తే బాగుంటుంది.’’ అని కడియం శ్రీహరి ప్రతిపాదించినట్లు సమాచారం.