జిల్లాల రద్దు అంటూ రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: కేటీఆర్

BRS Working president KTR: సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Courtesy: IDL

Share:

హైదరాబాద్‌ : సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల​ వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి చెందినట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. విధ్వంసమైన తెలంగాణను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పదేండ్ల పాలనలో వికాసం వైపు నడిపించారన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎనిమిదో రోజు వరంగల్‌ పార్లమెంట్‌ సమీక్షా సమావేశం జరిగింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల​ వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి చెందినట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదని, అందుకే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నామన్నారు. కొన్ని తప్పిదాల కారణంగా ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లిందన్నారు. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ పార్టీవి ఆరు గ్యారంటీలు కాదు, 420 అబద్ధాలన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వారి 420 మ్యానిఫెస్టోతోనే ఎండగట్టాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపాడలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమవేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌పై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు. 

ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, మధుసుధనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.