తెలంగాణలో గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..

Telangana Government: ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఉండనున్నారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఉండనున్నారు. కమిటీలో సభ్యులుగా  మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించారు.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో గ్యారంటీల కోసం దాదాపు కోటి 25 లక్షలకు పైగా మంది అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను జనవరి 17 వరకు ఆన్ లైన్ లో నమోదు చేయనుంది. ఇందులో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు జరిగాయి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు టైం పాస్ చెయ్యబోమని అన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాం.. చేసి తీరుతామన్నారు. ఆరు పథకాల అమలుకు సబ్ కమిటీని ప్రకటించామని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సబ్ కమిటీ ఛైర్మన్ గా ఉంటారని చెప్పారు. ఆరు పథకాలు ప్రజలకు అందించే బాధ్యత  సబ్ కమిటీదేనన్నారు.  

ప్రజాపాలనలో కోటి 25లక్షల అప్లికేషన్లు వచ్చాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జనవరి 25 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందన్నారు. నిజమైన అర్హులను గుర్తించాలనే తమ లక్ష్యమన్నారు.  ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, కారు కూతలు కూస్తే సహించేది లేదన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. అసలైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పథకాలు అమలు కాలేదని నెల రోజులకే విమర్శిస్తున్నారని ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.