ఏపీలో మొదలైన ఎన్నికల వేడి.. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం

Central Election Commission in AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనుంది.

Courtesy: IDL

Share:

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దేశ సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.  ఇందులో భాగంగా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సన్నద్ధత, ఓటర్‌ జాబితా సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు, రేపు  సీఈసీ సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఈ సమీక్షకు హాజరుకానున్నారు. విజయవాడలోని నోవాటెల్‌లో నేడు, రేపు ఈ సమావేశం జరగనుంది. డిసెంబర్ 22వ తేదీన ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, అదేవిధంగా డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చ జరపనున్నారు. 

ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై కలెక్టర్లు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌  ఇవ్వనున్నారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం చర్చించనుంది. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.


రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన నాయకుల వాడీవేడీ ప్రసంగాలు, సమావేశాలతో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతుండడంతో ఇక సమరం మొదలైనట్లేనని అంతా భావిస్తున్నారు. ఈరోజు, రేపు వారు రాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నారు. 


నకిలీ ఓట్ల అంశంపై లోక్ సభలో గళం విప్పిన ఎంపీ గల్లా జయదేవ్
ఏపీలో ఓటర్ల జాబితా, నకిలీ ఓట్ల అంశం తీవ్ర రచ్చ రేపుతోంది. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపు కూడా జరుగుతోందని అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఈ తప్పులకు కారణం మీరంటే మీరంటూ ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఏకంగా పార్లమెంట్ లో కూడా నకిలీ ఓట్ల అంశాన్ని లేవనెత్తారు టీడీపీ నేతలు. ఏపీలో ఓటర్ల జాబితా తయారీలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్ సభలో ఆరోపించారు.

కాగా, ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది:

రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, చీఫ్‌ సెక్రటరీలకు ఈసీ ఆదేశాలు పంపింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండకూడదన్న నిబంధనల మేరకు బదిలీలు, పోస్టింగ్‌లపై మార్గదర్శకాలు జారీ చేసింది.

ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు:

- ఎన్నికలతో సంబంధం ఉన్న వారు సొంత జిల్లాలో ఉండరాదు
- మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించకూడదు
- 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యే వారిని కొనసాగించొద్దు
- అదనపు డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి నుంచి పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకూ ఈ నిబంధనలే వర్తింపజేయాలి.
- బదిలీలు, పోస్టింగుల వివరాలు జనవరి 31వ తేదీ లోగా ఇవ్వాలి