Bharat Rice: రూ.25కే కిలో బియ్యం.. కేంద్రం సన్నాహాలు?

Bharat Rice: భారత్‌ రైస్‌(Bharat Rice) పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ.25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Courtesy: x

Share:

దిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే భారత్‌ రైస్‌(Bharat Rice) పేరుతో కిలో బియ్యాన్ని రాయితీ కింద రూ.25కే ఇవ్వాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఎగ‌బాకుతుండ‌టంతో ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులో భాగంగానే ఈ అంశం తెర మీదకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే భారత్ ఆటా, భారత్ దాల్ విక్రయాలు
ఇప్ప‌టికే  భార‌త్ ఆటా, భార‌త్ దాల్ పేరిట గోధుమ పిండి, ప‌ప్పుధాన్యాల‌ను కిలో రూ.27.50, రూ.60 రాయితీ ధరలకు విక్రయిస్తోంది. ధ‌ర‌ల‌కు ప్ర‌జ‌ల‌కు కేంద్రం అందిస్తోంది. ఈ ఉత్పత్తులు 2,000 కంటే ఎక్కువ రిటైల్ పాయింట్లలో పంపిణీ చేస్తున్నారు. వీటిలాగే ‘భారత్‌ రైస్‌’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థ అయిన మదర్ డెయిరీ కిరాణా చైన్ సఫల్ సహా వివిధ మార్గాల ద్వారా కిలో ఉల్లిని రూ .25 చొప్పున సబ్సిడీ రిటైల్ అమ్మకాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. 


దేశవ్యాప్తంగా రిటైల్‌ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర రూ.43గా ఉంది. ఇది కిందటి ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం.. ‘భారత్‌ రైస్‌’ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాయితీ ధరతో అందించనున్న బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF), కేంద్రీయ భండార్ అవుట్‌లెట్‌, మొబైల్ వ్యాన్లు వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు భారత్ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని (Bharat rice) సరఫరా చేయాలనే ఆలోచన వెనుక పెరుగుతున్న ధరలను నియంత్రించి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న ఆలోచన ఉంది. 

ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్లకంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ధరల పరిశీలన విభాగం లెక్కల ప్రకారం చూస్తే, ఏడాది కాలంలోనే బియ్యం ధరలు 15% మేర పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ 21 నాటికి బియ్యం రిటైల్ ధర కిలోకి రూ.37.99గా ఉంది. ఇదే ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికి ఇది రూ.43.51 కి పెరిగింది. కొన్ని చోట్ల ఇది రూ.50 వరకూ ఉండటం గమనార్హం.