నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదం.. పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

Charminar Express: చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్‌లోకి చేరుకుంటున్న సమయంలో ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో పట్టాలు తప్పి ప్లాట్‌ఫామ్‌ సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది.

Courtesy: ANI

Share:

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్‌లోకి చేరుకుంటున్న సమయంలో ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకునే క్రమంలో పట్టాలు తప్పి ప్లాట్‌ఫామ్‌ సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది.  రైలులోని మూడు బోగీలు ఎస్‌ 2, ఎస్‌ 3, ఎస్‌ 6 లు పట్టాలు దాటి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. 

రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలట్‌ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్‌కు చేరుకునే క్రమం కావడంతో రైలు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్‌లో దిగడానికి కొన్ని సెకన్‌ల ముందు రైలు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఘటనపై స్పందించిన మంత్రి పొన్నం 
నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్  ఎక్స్‌ప్రెస్‌ రైలుకు జరిగిన ప్రమాదంపై హైదరాబాద్‌ ఇన్‌ఛార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని.. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు.  

పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఉదయం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఐదుగురు  ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.  ఈ  క్రమంలో  పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాంపల్లి-మేడ్చల్, మేడ్చల్-హైదరాబాద్(47251) మార్గాల్లో వెళ్లే ఎంఎంటీస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.