పేదలు కష్టపడే పరిస్థితి రానివ్వను.. ఏపీలో రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం: సీఎం జగన్

CM Jagan: ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్‌ను అక్షరాల రూ.3 వేలకు పెంచామని సీఎం తెలిపారు.

Courtesy: x

Share:

కాకినాడ: పేదలు తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడద‌ని రాష్ట్రంలో 66.34 లక్షల మందికి మంచి జరిగేలా సామాజిక పెన్షన్‌ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నామన్నారు. తన సైన్యం వాలంటీర్లు అని.. వారి ద్వారానే సమయానికి పెన్షన్‌ పంపిణీ చేయగలుగుతున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్‌ను అక్షరాల రూ.3 వేలకు పెంచామని సీఎం తెలిపారు. కాకినాడ‌లో ఏర్పాటు చేసిన పింఛ‌న్ల పెంపు కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించారు. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్‌లో ఒక మార్పు మాత్రమే కాదని.. జీవితాల్లో మార్పు రావాలని సీఎం జగన్ అన్నారు. 

గ్రామాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిందని, కులం, మతం, ప్రాంతం,వర్గం చూడటం లేదని, చివరికి ఏ పార్టీ అని చెప్పి ఎవరూ అడగడం లేదని, అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పాలనలోనే జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్న పరిస్థితిలో ఒక్కసారి గతానికి అంటే ఐదేళ్ల క్రితం పరిస్థితి గమనించాలని, అప్పట్లో చంద్రబాబు పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా పింఛన్‌ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చారని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. గతంలో పెన్షన్‌ కావాలంటే పడిగాపులు పడాలని, జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, పెన్షన్‌ తీసుకోవాలంటే లైన్లలో నిలబడాలని జగన్ గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అర్హత ఉంటే చాలు మంజూరు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

దత్త పుత్రుడు ఆనాడు ఏమయ్యాడు
ఐదేళ్లు గతంలో సీఎంగా ఉన్న ఒకాయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడని, ఆ ఇద్దరు కలిసి 2014లో ఎన్నికల ప్రణాళికలో వాళ్లు  ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, అందులో ఇళ్లు కట్టిస్తామని వాగ్ధానం చేశారని, చివరకు ఒక్క సెంట్‌ కూడా ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. అడ్డగోలుగా దత్తతండ్రి మోసం చేస్తే..ఈ దత్తపుత్రుడు కనీసం ప్రశ్నించలేదని, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదని సీఎం దుయ్యబట్టారు. కానీ, నేడు అక్కచెల్లెమ్మలకు వారి కుటుంబాలకు మంచి చేయాలని మీ బిడ్డ పరుగెత్తుంటే.. అక్షరాల 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూస్తుంటే.. ఇదే దత్తపుత్రుడు ఇవాళ కేంద్రానికి లేఖలు రాస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కల్యాణ్‌ కూడా భాగస్వామి అని విమర్శించారు. 

అసలు చంద్రబాబు హయాంలో ఇంత మంచి స్కీంలే లేవు..
"చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమ్మ ఒడి స్కీమే లేదు. కానీ, ఇప్పుడు ఈ స్కీమ్‌ ప్రవేశ పెట్టడమే కాకుండా.. దీని ద్వారా ఈ ఐదేళ్లలో 44.49 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు బటన్‌ నొక్కి నేరుగా రూ.26 వేల కోట్లు మీ ఖాతాల్లోకి జమ చేశాను. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి..ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి డబ్బులు ఇచ్చాను. చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు.ఆ ఐదేళ్లు రైతు భరోసా స్కీమే లేదు. ఇవాళ ప్రతి ఏడాది అక్షరాల 53.57 లక్షల మంది రైతులకు మీ బిడ్డ బటన్‌ నొక్కి నేరుగా నా రైతన్నల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.13,500 జమ చేస్తున్నాం. ఈ స్కీమ్‌ ద్వారా ఈ ఐదేళ్లలో రూ.33,300 కోట్లు ఇచ్చాం. నేరుగా డబ్బులు పంపిస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ పాలనలోనే జరుగుతుంది. ప్రతి విషయం కూడా ఆలోచన చేయాలి" అని సీఎం స్పష్టం చేశారు.