దిల్లీకి సీఎం రేవంత్, నామినేటెడ్ పదవుల గురించి హైకమాండ్ తో చర్చించనున్నారా?

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

Courtesy: గ

Share:

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండటంతో ఈ సమావేశం ప్రధాన్యం సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని రేవంత్‌ కోరనున్నట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలవనున్నారు.

విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై విన్నవిస్తారని తెలుస్తోంది. కేంద్రం నుంచి ఈ ఏడాది గ్రాంట్ల కింద రూ.43 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేసినా ఇంతవరకు రూ.5 వేల కోట్ల వరకే వచ్చాయని, మిగతా నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరనున్నట్లు సమాచారం.

నామినేటెడ్ పదవుల భర్తీపై అగ్రనాయకత్వంతో చర్చ!
మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలవనున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్‌ పదవుల భర్తీ తదితర అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక గురించి కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రి వర్గం విస్తరణ అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నామినేటెడ్‌ పదవుల కోసం పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. వీటిని లోక్‌సభ ఎన్నికలకు ముందే భర్తీ చేస్తారా లేదా అవి ముగిసిన తర్వాతా అనేది అధిష్ఠానం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన మాణిక్‌రావ్‌ ఠాక్రేను అధిష్ఠానం ఇటీవల గోవాకు మార్చింది. తెలంగాణకు పూర్తిస్థాయి ఇన్‌ఛార్జిని నియమించకుండా.. కేరళ బాధ్యతలు చూస్తున్న దీపా దాస్‌మున్షీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.