రాయదుర్గం-శంషాబాద్ మెట్రోకు బ్రేక్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

CM Revanth Reddy: గత ప్రభుత్వం సుమారు రూ.6,250 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రతిపాదనలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Courtesy: x

Share:

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రోరైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెట్రోరైలు ఎండీని ఆదేశించారు. మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలను మెరుగుపరచాలని ఆదేశించారు. గత ప్రభుత్వం సుమారు రూ.6,250 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రతిపాదనలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) అధికారులతో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన పత్రికా ప్రకటనలో కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపారు. 

పలు విస్తరణ ప్రాజెక్టులతోపాటు పాతబస్తీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌.. ఐదు మార్గాల్లో 76 కిలోమీటర్ల మేర ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీని అనుసరిస్తూ నార్సింగి నుంచి తారామతిపేట వరకు (ఈస్ట్‌ టు వెస్ట్‌) 40 కిలోమీటర్లు, కేసీఆర్‌ ప్రభుత్వం ఆమోదించిన ప్యారడైజ్‌-కండ్లకోయ, జేబీఎస్‌-శామీర్‌పేట డబుల్‌ డెక్కర్‌ మెట్రో ప్రాజెక్టులపైనా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

మెట్రోలో ఎక్కువ మంది తిరగాలి
మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఎంఎయూడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిశోర్‌, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా చేపట్టే మెట్రో మార్గాలు ఎక్కువ మంది ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూడాలని సూచించారు. పాతబస్తీలో దార్‌-ఉల్‌-షిఫా జంక్షన్‌ నుంచి శాలిబండ జంక్షన్‌ మీదుగా నిర్మించే మార్గం కోసం రోడ్డును 100 అడుగుల విస్తీర్ణంతో చేపట్టాలని, ఇందుకోసం స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించి, రోడ్డు విస్తరణ పనులు సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. పాతబస్తీ మీదుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ఆ ప్రతిపాదన రద్దు
గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపాదించి, పనులు మొదలుపెట్టిన రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కిలోమీటర్లు) హోల్డ్‌లో ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఔటర్‌ రింగురోడ్డు అందుబాటులో ఉన్నదని, దానికి బదులుగా ఎయిర్‌పోర్టుతో మెట్రో అనుసంధాన మార్గాన్ని ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా చేపట్టాలని సూచించారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్రతిపాదించినప్పుడు ప్రయాణికుల బ్యాగేజీ చెకింగ్‌ను కూడా అక్కడే పూర్తిచేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని భావించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడిది గందరగోళంలో పడింది.

త్వరలో కేంద్ర మంత్రితో సమావేశం
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగర అవసరాలను తీర్చడానికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌(బృహత్‌ ప్రణాళిక) సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ  ప్రాంతాలను గ్రోత్‌హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రోరైలు అనుసంధానం జరగాలని చెప్పారు.  ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించినందున మెట్రో విస్తరణ అవసరమని పేర్కొన్నారు. జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు, కండ్లకోయ/మేడ్చల్‌ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ జరగాలని సీఎం పేర్కొన్నారు. నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాల ప్రతిపాదనలపై త్వరలోనే కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ను కలవాలని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 40 కిలోమీటర్ల పొడవున ఉన్న మూసీ తీర ప్రాంతంలో మెట్రో రైలు కారిడార్‌ను నిర్మించేందుకు పురపాలక శాఖ, మెట్రో అధికారులు కలిసి పని చేయాలని, నాగోల్‌, ఎంజీబీఎస్‌ల మీదుగా మూసీ వెంట నార్సింగి నుంచి తారామతిపేట వరకు ఈ మెట్రో రైలుమార్గం అనుసంధానం అయ్యేలా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు.