జనవరి 22న అయోధ్యకు 100 చార్టర్డ్ ఫ్లైట్స్: సీఎం యోగి ఆదిత్యనాథ్

CM Yogi Adityanath : జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకల కోసం 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగుతాయని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తెలిపారు.

Courtesy: x

Share:

లక్నో: శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఈ నెల 22న ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగబోతోంది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తవుతున్నాయి. కాగా, జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకల కోసం 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగుతాయని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తెలిపారు. జనవరి 22న దాదాపు 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగుతాయని అంచనా వేస్తున్నట్లు ఆదిత్యనాథ్ తెలిపారు. ఇండిగో ద్వారా అయోధ్య నుండి అహ్మదాబాద్‌కు విమాన ప్రారంభోత్సవం కోసం జరిగిన వర్చువల్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు. కార్యక్రమం అనంతరం సీఎం మాట్లాడారు. 

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన వాల్మీకి మహర్షి  అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 చార్టర్డ్ విమానాలు ల్యాండ్ అవుతాయని తెలిపారు. ఫ్లైట్స్ ల్యాండింగ్ తో  ఎయిర్‌‌‌‌పోర్టు సామర్థ్యాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌కు నాల్గవ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం యోగి థ్యాంక్స్ చెప్పారు. 

ఆలయంలో బంగారు తలుపులు
అయోధ్యలో రామాలయంలో 42 బంగారు పూత పూసిన తలుపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే, ఆలయంలో 12 అడుగుల ఎత్తు మరియు 8 అడుగుల వెడల్పు ఉన్న మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి పై అంతస్తులో ఈ భారీ బంగారు ద్వారం ఏర్పాటు చేయబడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో మరో 13 బంగారు తలుపులు అక్కడ అమర్చబడతాయని సమాచారం. రామాలయంలో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా, వాటిలో 42 తలుపులకి బంగారు పూత పూయనున్నట్లు సీఎంఓ తెలిపింది. రామమందిరంలో ప్రతిష్ఠ కోసం 5,500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం ఇప్పటికే గుజరాత్‌ నుంచి సోమవారం అయోధ్యకు చేరుకొంది.

గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని తీసుకురానున్న ప్రధాని
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేళ రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పూజ మండపం నుంచి గర్భగుడికి 25 సెకన్లలో మోదీ చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్‌ లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 17న అయోధ్యలో నిర్వహించతలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపును అధిక రద్దీ ఆలోచనతో రద్దు చేశారు. మకర సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ‘ఎక్స్‌’లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. 

వేడుకకు అద్వానీ వస్తారు: వీహెచ్పీ 
అయోధ్యలో 22న జరిగే రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు బీజేపీ అగ్రనేత ఎల్‌‌‌‌కే అద్వానీ(96) కూడా హాజరవుతారని వీహెచ్‌‌‌‌పీ(విశ్వహిందూ పరిషత్) అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు. అయితే, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆరోగ్యం, వయస్సు  దృష్ట్యా అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు అయోధ్యలో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం లేదని రామజన్మభూమి ట్రస్ట్ గత నెలలో పేర్కొంది.