లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనపడదు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి

Kishan Reddy: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే అని, బీఆర్ఎస్ ప్రభావం ఉండదని  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే అని, బీఆర్ఎస్ ప్రభావం ఉండదని  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి పండగ తర్వాత లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని, ప్రధాని మోడీ ఈ నెలలోనే రాష్ట్రంలో ప్రచారానికి వస్తారని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఅర్ఎస్ ప్రభావం ఏ మేరకు ఉన్నదో తేలిపోయిందని, ఇక రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ తో గానీ, కేసిఆర్ తో గానీ అవసరం లేదన్నారు.  

ఇప్పటికే తెలంగాణలో ఎంపీ సెగ్మెంట్లవారీగా ఇన్‌చార్జిలను నియమించామని, ఇందులో ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఏకైక ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించామన్నారు. సంస్థాగతంగా కూడా ఇన్‌చార్జిలను మంగళవారం ప్రకటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలపై రాష్ట్రంలోని సీనియర్ నేతలతో పార్టీ స్టేట్ ఆఫీస్‌లో సోమవారం జరిగిన సమావేశంలో పలు అంశాలను చర్చించామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

బీజేపీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో చర్చించామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎంత శాతం ఓట్లు పడ్డాయో సమీక్షించుకున్నామన్నారు. ప్రధాని మోడీ పదేళ్ల పాలనతో యువతలో విశ్వాసం గణనీయంగా పెరిగిందని, బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని, వారి మద్దతును కూడగడతామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీ అని, నేతల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉండడం సహజమేనని, వాటిని పార్టీ అంతర్గత సమావేశాల్లో పరిష్కరించుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నిక లేకపోవడంపై స్పందిస్తూ.. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

కొత్త ఓటర్లను కలిసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామని, ఫస్ట్ టైమ్ ఓటర్లను ఆకర్షిస్తామన్నారు. మోడీని మూడోసారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెల్చుకుంటామన్నారు. ఈ నెలలో రాష్ట్రంలో కీలకమైన ప్రాంతాలను గుర్తించి ప్రధాని మోడీని ఆహ్వానించి బహిరంగసభలకు ప్లాన్ చేస్తామన్నారు. ఈ పర్యటనలో భాగంగానే ప్రధాని హోదాలో పలు అబివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రామమందిర నిర్మాణం, విగ్రహ ప్రాణప్రతిష్ట తమ పార్టీకి కీలకంగా మారుతుందన్నారు. చాలా మంది ప్రజలు ఈ అపూర్వ సన్నివేశం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. సుమారు 150 దేశాల్లో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లైవ్ ప్రసారమవుతుందని, ఐకానిక్ టైమ్ స్క్వేర్‌లో సైతం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.