బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే.. అందుకే కాళేశ్వరంపై విచారణ చేయడం లేదు: కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లో మంగళవారం కిషన్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదని.. అందుకే బీఆర్ఎస్ తో అవగాహన కుదుర్చుకుందని ఆరోపించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్  మూడు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయని ధ్వజమెత్తారు. 

అవినీతి, కుటుంబ పాలన వల్లే  ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను ఓడించారు కానీ.. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని  విమర్శించారు. కాళేశ్వంపై విచారణ కోరుతూ.. కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్ సీబీఐ ద్వారా విచారణ చేపట్టాలి
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు.. ఎలాంటి భూ పరీక్షలు చేయలేదని.. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గోప్యంగా ఉంచుతుందని.. ఊచలు లెక్కపెట్టాల్సిన కేసీఆర్ ను కాపాడుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కేసీఆర్ ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించలేదని.. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సీబీఐ విచారణకు అంగీకరిస్తుందా లేదా.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. 

అసలు కాళేశ్వరంపై విచారణ ఉందా లేదా?
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెచ్చించిన లక్షకోట్లు ఏమయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ గతంలో ఏం మాట్లాడారో ప్రజలు గుర్తించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్ లైన్ గా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది.. అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంతో ప్రజాధనాన్ని గోదావరిపాలు చేశారని ఆరోపించారు. 21 అక్టోబరు, 2023న కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగాయని, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై నాడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించారు. అవినీతికి, కాంగ్రెస్ పార్టీకి విడదీయలేని బంధం ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పట్ల.. కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటే
బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటేనని రెండూ బొమ్మాబొరుసు పార్టీలే అన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.. కాంగ్రెస్ పొత్తులో భాగంగానే రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారని, కాబట్టే .. దగ్గరి మిత్రుల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోలుబొమ్మలాట ఆడుతున్నాయన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తామన్న రేవంత్ రెడ్డి.. నేడు సీబీఐ ఎంక్వైరీకి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఎందుకు రాయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దమ్ముంటే సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలని ఒకవేళ సీబీఐ ఎంక్వైరీ జరపాలని కేంద్రాన్ని కోరితే 48 గంటల్లో దర్యాప్తును ప్రారంభిస్తుందని చెప్పారు.