మనీ లాండరింగ్ కేసు: ప్రియాంక గాంధీకి షాకిచ్చిన ఈడీ

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నగదు అక్రమ చలామణీ (money laundering case) అభియోగాలతో దళారి సంజయ్‌ భండారీపై నమోదు చేసిన ఓ కేసులో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలిసారి ప్రస్తావించింది.

Courtesy: Top Indian News

Share:

దిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నగదు అక్రమ చలామణీ (money laundering case) అభియోగాలతో దళారి సంజయ్‌ భండారీపై నమోదు చేసిన ఓ కేసులో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తొలిసారి ప్రస్తావించింది. అయితే ప్రియాంకను నిందితురాలిగా మాత్రం పేర్కొనలేదు. ఇదే ఛార్జ్‌షీట్‌లో ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా ప్రస్తావించింది. ఎన్ఆర్‌ఐ వ్యాపారవేత్త సీసీ థంపితో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది.

భండారీ తన అక్రమ ఆర్జనతో లండన్‌లో దక్కించుకున్న ‘12 బ్రియాన్‌స్టోన్‌ స్క్వేర్‌’ అనే ఇంటికి రాబర్ట్‌ వాద్రా మరమ్మతులు చేయించారని, అందులో నివాసం కూడా ఉన్నారని ఈడీ మంగళవారం ఆరోపించింది. బ్రిటన్‌కు చెందిన సుమిత్‌ చడ్ఢా అనే వ్యక్తి.. వాద్రాకు ఈ వ్యవహారంలో సహకరించారని పేర్కొంది. ఈ మేరకు సుమిత్‌తో పాటు వాద్రాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చెరువథుర్‌ చకుట్టి థంపిపై తాజా అభియోగపత్రం దాఖలు చేశామని ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా 2006లో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని దక్కించుకున్నారని ఆ ఛార్జ్‌షీట్‌లో దర్యాప్తు సంస్థ పేర్కొంది. 2006లో ఫరీదాబాద్‌లో ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం, 2010లో ఆ భూమిని అదే ఏజెంట్‌కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది. ఆ ఏజెంట్‌ కొంత భాగాన్ని థంపికి కూడా విక్రయించాడని తెలిపింది. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్ని విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఈడీ ఆరోపిస్తోంది. ఆ లావాదేవీలు వాద్రా, థంపి మధ్య భాగస్వామ్య సంబంధాలు, పరస్పర వ్యాపార ప్రయోజనాలను వెల్లడిచేస్తున్నాయని తన అభియోగాల్లో పేర్కొంది. ఈ కేసులో నిందితుడైన భండారీ 2016లోనే బ్రిటన్‌కు పారిపోయారు. ఆయన్ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ చేసిన వినతికి బ్రిటన్‌ సర్కారు ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది. ఈ వ్యవహారంలో ఈడీ తాజాగా ప్రియాంక గాంధీ పేరును ఛార్జిషీట్ లో నమోదు చేయడం ఆసక్తిగా మారింది.