'భారత్ న్యాయ్ యాత్ర' పేరుతో మళ్లీ జనంలోకి రాహుల్ గాంధీ

Bharat Nyay Yatra: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ మాదిరిగానే దేశ ప్రజలను ఏకంగా చేసేందుకు మరో యాత్రకు సిద్ధమయ్యారు. ‘భారత్‌ న్యాయ్ యాత్ర (Bharat Nyay Yatra)’ పేరుతో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుండి ముంబయి వరకు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.

Courtesy: Top Indian News

Share:

కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ మాదిరిగానే దేశ ప్రజలను ఏకంగా చేసేందుకు మరో యాత్రకు సిద్ధమయ్యారు. ‘భారత్‌ న్యాయ్ యాత్ర (Bharat Nyay Yatra)’ పేరుతో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుండి ముంబయి వరకు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. 'భారత్ న్యాయ్ యాత్ర' జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముంబయిలో ముగుస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ పాదయాత్ర నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మణిపుర్ టూ ముంబయి:

ఈ యాత్ర మణిపుర్‌ నుంచి ముంబయి వరకు కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ యాత్ర మొత్తం 6,200 కి.మీ మేర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించనున్నట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు. మణిపుర్‌ నుంచి మొదలయ్యే ఈ న్యాయ యాత్ర.. నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుందని తెలిపారు. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో రాహుల్‌ యాత్ర జరుగుతుంది. 

హైబ్రిడ్ మోడ్లో యాత్ర:
అయితే, రాహుల్‌ యాత్ర ఈసారి హైబ్రీడ్‌ మోడల్‌లో సాగనుంది. గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా.. ఈ సారి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వేణుగోపాల్‌ తెలిపారు. మధ్యమధ్యలో పాదయాత్ర కూడా ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర ఇచ్చిన గొప్ప అనుభవంతో రాహుల్‌ భారత్‌ న్యాయయాత్ర చేయబోతున్నారు. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదు. ఈసారి యువతను, మహిళలను, అణగారిన వర్గాలతో రాహుల్‌ ముఖాముఖి అవుతారని వెల్లడించారు.


బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యమంటూ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. ‘మిలే కదం.. జుడే వతన్‌ (అడుగులో అడుగు వేద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం)’ అనే నినాదంతో సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో రాహుల్‌ యాత్ర మొదలైంది. దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా.. 12 రాష్ట్రాల్లో, 145 రోజుల (దాదాపు 5 నెలలు)పాటు దాదాపు 3970 కి.మీ మేర రాహుల్‌ యాత్ర కొనసాగించారు. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. అయితే, ఈ సారి తూర్పు నుంచి పశ్చిమ వరకు బస్సు యాత్రలో పాల్గొననున్నారు.