మోదీ దృష్టిలో మణిపూర్ భారత్ లో భాగం కాకపోవచ్చు: రాహుల్ గాంధీ

Bharat Jodo Nyay Yatra: మణిపూర్‌లోని థౌబాల్‌ నుంచి ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు.

Courtesy: x

Share:

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణల కారణంగా లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లోని థౌబాల్‌ నుంచి ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్‌జామ్‌ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో మణిపూర్‌ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు.

 మణిపూర్‌ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 

మణిపూర్ ​లోని థౌబల్ నుంచి ఆదివారం ప్రారంభమైన ఈ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ యాత్రలో పలు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ వెంట కలిసి కదిలారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ నుంచి ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రాహుల్ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి మణిపూర్ వెళ్లారు. ఇదే విమానంలో రాహుల్ వెంట దాదాపు వంద మందికి పైగా నేతలు మణిపూర్ చేరుకున్నారు. రాహుల్ వెంట వెళ్లిన వారిలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మాజీ ఎంపీ మధుయాష్కి, కాంగ్రెస్ నేత షర్మిల వెళ్లగా.. సీడబ్ల్యూసీ సభ్యులు వంశీ చంద్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ఉత్సాహంగా ప్రారంభమైన ఈ యాత్రలో తెలంగాణ నేతలు మరింత జోష్ ​తో ముందుకు కదిలారు. 

దేశాన్నే ఇల్లుగా చేసుకున్నడు
‘‘రాహుల్ ​గాంధీ దేశాన్నే ఇల్లుగా, దేశ ప్రజలనే తన కుటుంబ సభ్యులుగా చేసుకున్నారు. సామాన్యుడి సమరమై.. మధ్య తరగతి గమ్యమై.. పేదవాడి గమనమై.. ఆడబిడ్డల ధైర్యమై.. యువత ఆశల సారథై.. రైతు కష్టం తీర్చే కర్షకుడై.. కదులుతున్న మరో మహాయాత్ర. జై బోలో భారత్​ న్యాయ్​యాత్ర’’ అని సీఎం రేవంత్​ ట్వీట్ ​చేశారు. 

"త్రివర్ణ పతాకం చేతబట్టి… భరత జాతి రక్షణకు నడుంకట్టి.. తూరుపు దిక్కున ఉదయించిన ఒక సూర్యుడు.. జాతి జనుల బతుకుల్లో ఛైతన్యపు వెలుగులు నింపేందుకు.. భారత్ న్యాయ్ యాత్రికుడై కదిలాడు." అని రేవంత్ మరో ట్వీట్ చేశారు.