చంద్రబాబును ఇంటికి వెళ్లి కలిసిన వైఎస్ షర్మిల.. కారణం అదేనా?

Congress leader YS Sharmila: తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆనాడు వైఎస్సార్ ఆకాంక్షించారని కాంగ్రెస్ నాయకురాలు షర్మిల తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు రాజా రెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికే ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. అంతే తప్ప ఎలాంటి రాజకీయ విషయాల గురించి చర్చించడానికి కాదని స్పష్టం చేశారు. కుమారుడు రాజారెడ్డి వివాహ శుభలేఖను చంద్రబాబుకు అందజేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న వైఎస్ రాజా రెడ్డి పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘గతంలో మా పెళ్లిళ్లకు మా నాన్న రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు సహా అందరినీ ఆహ్వానించారు, ఆ సమయంలో చంద్రబాబుసైతం హాజరై మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా కుమారురు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలించేందుకు మాత్రమే వచ్చా. వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు. మా కుటుంబంలో వివాహాలకు చంద్రబాబును వైఎస్‌ఆర్‌ పిలిచారు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పుబట్టారు. నేను చంద్రబాబుకే కాదు అందరికీ పంపించా. తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావు, కవితలకు కూడా క్రిస్మస్ కేకు పంపించానని షర్మిల చెప్పారు. రాజకీయాలు అన్నదే జీవితాలు కాదు.. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్.. రాజకీయాలు అనేది ప్రొఫెషన్.. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం..కేవలం రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే. అందరం ప్రజలకోసమే పనిచేయాలి.. పండుగకో, పెళ్లికో కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్‌ఆర్‌ కోరుకునేవారు. రాహుల్‌ ప్రధాని అయితేనే మతకలహాలు తగ్గుతాయి. నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది కాంగ్రెస్‌ పార్టీ ఇష్టం’ అని చెప్పారు.

ఫిబ్ర‌వ‌రి 17వ తేదీన వైఎస్ రాజా రెడ్డి అట్లూరి ప్రియా ఒక్క‌టి కాబోతున్నార‌ని షర్మిల ఇదువరకే ట్విటర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. జనవరి 18న అట్లూరి ప్రియతో తన కొడుకు ఎంగేజ్ మెంట్, ఫిబ్రవరి 17న పెళ్లి జరగబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. జనవరి 2న కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో తాము ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ ని సందర్శించి ఆశీసులు తీసుకున్నారు. ఈనెల 18న గోల్కొండ రిసార్ట్ లో నిశ్చితార్థం, ఫిబ్రవరి17న రాజస్థాన్ లో వివాహం జరగనుంది. ఫిబ్రవరి 24న శంషాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు.

షర్మిల ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులకు కుమారుడి పెళ్లి పత్రికలు అందజేస్తూ వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల  తాడేపల్లిలోని తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ నివాసానికి వెళ్లి వివాహ శుభలేఖను అందజేశారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలకు వెళ్లిన షర్మిల.. కుమారుడి వివాహ శుభలేఖను అందజేశారు. 

అమెరికాలోని డల్లాస్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసిన వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, చట్మీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనుమరాలు అట్లూరి ప్రియలు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి.