షర్మిల కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం.. ఈ వారంలోనే చేరికా?

YS Sharmila: వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాల విశ్వసనీయ సమాచారం. 

Courtesy: x

Share:

అమరావతి: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటివరకూ తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో హల్ చల్ చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కాంగ్రెస్‌ వర్గాల విశ్వసనీయ సమాచారం. 

ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు షర్మిల భర్త అనిల్‌కుమార్‌తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు చర్చించినట్టు సమాచారం. ఫైనల్‌గా షర్మిలతో కూడా ఈ విషయం మరోసారి చర్చించాక ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ పగ్గాలు చేపట్టడానికి షర్మిల ఇప్పడే అంగీకరించని పక్షంలో తొలుత పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించి, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది పార్టీ వ్యూహమని చెప్తున్నారు.

గిడుగు కీలక వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు  వెల్లడించారు. షర్మిలతో పాటు పార్టీలోకి ఎవరు వచ్చినా తప్పక ఆహ్వానిస్తామని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా త్వరలోనే కలుస్తానని గిడుగు వెల్లడించారు. తనకు పలువురు ఎమ్మెల్యేలు, మాజీలు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు.ఏఐసీసీ పెద్దలు, పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వీరి విషయంలో నడుచుకుంటామన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా వైఎస్ షర్మిల పార్టీలోకి వచ్చి పనిచేస్తామంటే అందరూ స్వాగతించాల్సిందేనని అన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా అందరం పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణయం హైకమాండ్ దేనని ఆయన అన్నారు. షర్మిల వచ్చి పనిచేస్తానంటే ఎవరూ అభ్యంతరం పెట్టే వారు ఉండరని గిడుగు రుద్రరాజు అన్నారు. అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. వ్యక్తిగత ఆలోచనలకు జాతీయ పార్టీలో తావు లేదని గిడుగు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

ఆంధ్రలో పూర్వవైభవమే టార్గెట్‌
ఇప్పటికే ఏపీకి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఢిల్లీకి పిలిపించుకొని షర్మిల చేరిక, పార్టీ బాధ్యతల అప్పగింత, సార్వత్రిక ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్‌ సీనియర్లను కూడా ఘర్‌వాపసీ నినాదంతో తిరిగి పార్టీలోకి తీసుకరాబోతున్నట్టు రుద్రరాజు తెలిపారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కూడా చర్చిస్తున్నామని, చాలామంది సీనియర్లు కూడా తిరిగి పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పడం గమనార్హం. షర్మిలను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొనిరావడం, ఆమె పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనానికి ఒప్పించడం వెనుక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మంత్రాంగం ఫలించినట్టు చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉన్నది. కాంగ్రెస్‌, బీజేపీ రెండు జాతీయ పార్టీలకు అక్కడ చోటు లేకుండా పోయింది.

రాజ్యసభకు షర్మిల
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకోగలిగే స్థితిలో లేకపోవడంతో 2029 ఎన్నికలే టార్గెట్‌గా షర్మిలను ఇప్పటినుంచే రంగంలోకి దింపాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్టు తెలిసింది. షర్మిలను 2029 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఇప్పటి నుంచే ప్రొజెక్టు చేయాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆమె కడప నుంచి పోటీకి అంగీకరించని పక్షంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించేలా కాంగ్రెస్‌ పెద్దలు ప్లాన్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు వెళ్లేది నిజమైతే తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెల్లడించారు. మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నన్ను పొమ్మన లేక పొగపెట్టారు. మంగళగిరి అభివృద్ధికి రూ.1,250 కోట్లు ఇస్తామన్నారు. కనీసం రూ.120 కోట్లు కూడా ఇవ్వలేదు. మంగళగిరిలో అభివృద్ధి పనులకు నా సొంత నిధులు ఖర్చు చేశా. వైకాపా ప్రభుత్వం అవినీతి బయటకు రాగానే కోర్టుల్లో కూడా కేసు వేస్తా. షర్మిల కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది.. షర్మిలతోనే నడుస్తానని చెప్పా’’ అని తెలిపారు.