4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు కొలిక్కి?

తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు, నామినేటెడ్ పదవులకు ఛైర్మన్ల ఎంపిక ఇవాళ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.

Courtesy: x

Share:

హైదరాబాద్: తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు, నామినేటెడ్ పదవులకు ఛైర్మన్ల ఎంపిక ఇవాళ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి దావోస్‌ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోపు అభ్యర్థులను ఖరారు చేయడంపై దృష్టి సారించారు. తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప దాస్‌మున్షీ, సునీల్ కనుగోలు, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ చైర్మన్ల పై సీఎం రేవంత్‌ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారు. పేర్లు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోట కింద రెండు, ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీలు భర్తీ చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రేవంత్‌, దీపా దాస్‌మున్షీ, సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం రేవంత్ నివాసంలో చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేని నాయకులకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ ఇన్‌ఛార్జి కార్యదర్శులు ఓ జాబితాను రేవంత్ రెడ్డి, దీప దాస్‌మున్షి, సునీల్ కొనుగోలు ఇచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్ర నాయకురాలు సోనియాగాంధీలను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రేవంత్‌రెడ్డి ఈ నెల 14న మణిపుర్‌లో మొదలయ్యే రాహుల్‌గాంధీ భారత్‌జోడో న్యాయయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రానికల్లా దిల్లీకొస్తారు. ఆ వెంటనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు పయనమవుతారు. 21వ తేదీన తిరిగివస్తారు. అయితే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ఈ నెల 18తో ముగియనున్నందున ముఖ్యమంత్రి దావోస్‌కు బయలుదేరే లోగానే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 

నాలుగింటిలో రెండు శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్‌కే దక్కే అవకాశాలున్నాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. పార్టీ నేతలు షబ్బీర్‌అలీ, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్‌, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సంపత్‌కుమార్‌, నిరంజన్‌, మధుయాష్కీ, శోభారాణి, అనిల్‌కుమార్‌ తదితరులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వాటికి కూడా ఇప్పుడే అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేయనుందని తెలుస్తోంది. నాఒకటి తెలంగాణ జన సమితికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి.