ఏపీలో కీలక పరిణామం.. చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ!

ఏపీలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో  ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన జరుగుతుండగా.. మరోవైపు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెదేపా అధినేత చంద్రబాబుతో కలవడం చర్చనీయాంశంగా మారింది.

Courtesy: Top Indian News

Share:

అమరావతి: ఏపీలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో  ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన జరుగుతుండగా.. మరోవైపు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేశ్‌తో కలిసి ప్రశాంత్‌ కిషోర్‌ కనిపించారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు షో టైమ్‌ కన్సల్టెన్సీ పేరిట తెదేపాకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్‌ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. 

ఏపీలో గత ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. అప్పట్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ సారి జనసేనతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది. అయితే, ప్రశాంత్ కిషోర్ విజయవంతమైన వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన చివరి సారిగా బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ కోసం పని చేశారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్షంగా పని చేయకపోయినప్పటికీ, ఆయన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ మాత్రం వివిధ పార్టీలకు పని చేస్తోంది. ప్రస్తుతం ఐ ప్యాక్ ఏపీలో వైసీపీ కోసం పని చేస్తోంది.