దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం: కవితకు ఈడీ నోటీసులు, ఆమె రిప్లై ఏంటంటే?

Delhi Liquor case: దిల్లీ మద్యం కేసులో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

Courtesy: x

Share:

హైదరాబాద్: దిల్లీ మద్యం కేసులో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 16న (మంగళవారం) విచారణకు హాజరుకావాలని సోమవారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా ఈడీ జారీ చేసిన నోటీసులపై ఆమె స్పందించారు.

ఆమె రిప్లై ఏంటంటే?

ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని.. తాను విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేశారు. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని, తన కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని లేఖలో కవిత తెలిపారు. కాబట్టీ తాను రేపటి విచారణకు రాలేనని లేఖలో స్పష్టం చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు గతంలో ఈడీ మూడు సార్లు  అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది.  ఈక్రమంలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మహిళలను ఇంటి వద్ద లేదా వీడియో విచారణ జరపాలని తన పిటిషన్‌లో తెలిపింది. దీంతో కవితకు ఊరట లభించింది. ఇప్పుడు మళ్లీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా మద్యం కేసులో ఇప్పటికే ఈడీ నాలుగుసార్లు నోటీసులు పంపించింది. మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 18న హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపించారు. అయితే తనకు ఇచ్చిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.