2 ఎంపీ స్థానాల నుంచి 303 స్థానాలకు.. దేశమంతా బీజేపీకి మద్దతు పలుకుతోంది: మోదీ

PM Modi: దేశానికి కిచిడీ ప్రభుత్వం (మిలీ-జులీ సర్కార్‌) అవసరం లేదని, దేశ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వచ్చే లోక్​ సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటేసి గెలిపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Courtesy: x

Share:

దిల్లీ: దేశానికి కిచిడీ ప్రభుత్వం (మిలీ-జులీ సర్కార్‌) అవసరం లేదని, దేశ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వచ్చే లోక్​ సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటేసి గెలిపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కూటమి పార్టీల ప్రభుత్వం అవసరం లేదనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. ఇప్పటికే ప్రజలు కూటమి పార్టీల అవినీతి పాలన చూశారన్నారు. ఆ తర్వాతే బీజేపీకి వరుసగా రెండు సార్లు అధికారం కట్టబెట్టారన్నారు. పాలనాపరమైన లోపాలు, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతి కారణంగానే కూటమి పార్టీల ప్రభుత్వాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. 

దేశవ్యాప్తంగా బీజేపీకి బలమైన మద్దతు
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి, జ్ఞాన్‌ (జీవైఏఎన్‌/జీ-పేదలు; వై-యువత; ఏ-అన్నదాత; ఎన్‌-మహిళాశక్తి)పై దృష్టి పెడతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని, దాని కోసం సర్వం ధారపోస్తానని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎంతో బలంగా ఉందన్నారు. లోక్​ సభ స్థానాల పరంగా సౌత్ ఇండియాలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని నొక్కి చెప్పారు. ‘‘దేశంలో బీజేపీకి మద్దతు లేని ప్రాంతమంటూ లేదు. కేరళలోని స్థానిక సంస్థల నుంచి అనేక రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆరు నెలల కింద వరకు కర్నాటకలో అధికారంలో ఉన్నాం. నేటికీ పుదుచ్చేరిలో మా ప్రభుత్వమే ఉంది. 16 రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ ఉంది. 8 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. అన్ని వర్గాలు, అన్ని భాషలను మేము గౌరవిస్తాం. 2014లో ఈశాన్య రాష్ట్రాల్లో మా ఉనికి లేదు. కానీ.. ఇప్పుడు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న నాగాలాండ్, మేఘాలయ వంటి ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో మా ప్రభుత్వమే ఉంది’’ అని మోదీ అన్నారు. అదే విధంగా దేశ 100 సంవత్సరాల స్వాతంత్య్రోత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ఆశావాదంతో ప్రజలు ఉన్నారు పేర్కొన్నారు. ఈ శక్తే తన చోదక శక్తిగా పనిచేస్తోందని వెల్లడించారు.

కుటుంబ రాజకీయాలతో ఇబ్బందులు
 ప్రస్తుతం అనేక పార్టీలు వంశపారంపర్య విధానాల్లో సాగుతున్నాయని మోదీ విమర్శించారు. ఆ కారణంగా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఏర్పడుతోందని ఆరోపించారు. 1984లో రెండు లోక్​సభ స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు 303 మంది ఎంపీ సీట్లకు పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఓ శక్తిగా అవతరించిందని తెలిపారు. పదేండ్ల బీజేపీ పాలనలో గ్లోబల్ క్రైసిస్, జియోపొలిటికల్ టెన్షన్స్, కరోనా వచ్చినా.. ఇన్​ఫ్లేషన్ యావరేజ్​గా 5.1 శాతంగా ఉంది. ఇన్​ఫ్రాస్ట్రక్చర్ రంగంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఇక్కడి అమ్మాయిలు క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు’ అని ప్రధాని మోదీ తెలిపారు.