త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటన షురూ: మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తారని చెప్పారు.

Courtesy: JBT Salaam Telugu

Share:

హైదరాబాద్‌: మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. భారాస అధినేత కేసీఆర్ (KCR) వచ్చేనెలలో రోజూ తెలంగాణ భవన్‌కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని, త్వరలోనే జిల్లాల్లోనూ పర్యటిస్తారని మాజీ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షిస్తూనే లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణపై చర్చించారు. 

కేసీఆర్ కిట్ నుంచి కేసీఆర్ బొమ్మ తొలగిస్తారేమో కానీ..ప్రజల గుండెల నుంచి కేసీఆర్‌ను తొలగించలేరని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోంది. భారాస కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఊరుకోం. ఎమ్మెల్యేలమంతా బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోంది. ఇంకా ‘రైతు బంధు’ వేయలేదు. ఇలా అయితే రైతు వ్యవసాయం ఎలా చేయాలి?’’ అని హరీశ్ వెల్లడించారు.

త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తారని చెప్పారు.‘‘అసెంబ్లీ ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మన సత్తా ఏమిటో చూపిద్దాం. పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమష్టిగా పని చేయాలి. ఎవరూ అధైర్య పడొద్దు. మున్ముందు మళ్లీ మంచి రోజులు వస్తాయి. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుస్తుంది’’ అని హరీశ్ వెల్లడించారు. కార్యక్రమంలో కడియం శ్రీహరి, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీశ్‌ రెడ్డితో పాటు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.