మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ స్వీకరించిన సీఎం రేవంత్.. తెలంగాణ అసెంబ్లీలో కరెంటు రగడ

విద్యుత్‌ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ చేయగా.. ఆయన సవాల్ స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.

Courtesy: x

Share:

తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. విద్యుత్‌ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ చేయగా.. ఆయన సవాల్ స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అంతేకాకుండా, విద్యుత్తు​కు సంబంధించిన మూడు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్​గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపారు. తమ ఆర్థిక తప్పిదాలను కప్పిపుచ్చుకునేలా ఎదురు దాడి చేస్తున్నామని బీఆర్​ఎస్​ నేతలు అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అలా అనుకుంటే వారు పొరపడినట్లేనని అన్నారు. ఈ క్రమంలోనే వాస్తవాలను సభ ముందు ఉంచి చర్చించేందుకు తొమ్మిదిన్నరేళ్లలో గత ప్రభుత్వం ముందుకు రాలేదని రేవంత్ పేర్కొన్నారు. 

విద్యుత్ రంగాన్ని పూర్తిస్థాయిలో పరిశీలన చేసి శ్వేతపత్రాన్ని సభ ముందుంచామని తెలిపారు. గత ప్రభుత్వం తప్పులను అవగాహన రాహిత్యంతో చేసిందా లేక ఉద్దేశపూర్వకమా అనేది విచారణలో తేలుతుందని సీఎం రేవంత్ అన్నారు.అత్యవసరమంటూ టెండర్లు లేకుండానే ఛత్తీస్​గఢ్​తో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దానిపై అసెంబ్లీలో తాము గతంలోనే చెప్పే ప్రయత్నం చేస్తే, మార్షల్స్​ ద్వారా బయటకు పంపించారని గుర్తు చేశారు. ఓ అధికారి వాస్తవాలు చెబితే హోదా తగ్గించి మారుమూల ప్రాంతానికి పంపించారన్నారు. ఛత్తీస్గఢ్ ​లో 2014 నవంబరు 3న జరిగిన 1000 మెగా వాట్ల ఒప్పందం వల్ల ప్రజలపై రూ.1,326 కోట్ల భారం పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై కూడా విచారణ జరిపిస్తామన్నారు.


భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి: సీఎం రేవంత్
భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామని అన్నారు. వ్యవసాయ విద్యుత్‌ అనేది ప్రజల సెంటిమెంట్‌ అని దీని ఆధారంగా చేసుకుని ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇండియా బుల్స్ కంపెనీకి మేలు జరిగేలా ఒప్పందం చేసుకుందని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. రెండేళ్లలో పూర్తి చేస్తామన్న భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుకు ఏడేళ్లు పట్టిందన్నారు. కేటీపీఎస్ ఏడో దశ మెగా వాట్ ​కు రూ.8 కోట్లతో పూర్తి కాగా, భద్రాద్రి ప్రాజెక్టుకు మెగా వాట్ కు రూ.9.74 కోట్లు ఎందుకు ఖర్చు అయిందని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవకుండా బీహెచ్ఈఎల్​ తో 2015 జూన్ 1న ఒప్పందం జరిగిందని, దాని వెనక ఏం జరిగిందో కూడా విచారణలో తేలుతుందని సీఎం అన్నారు.

2014లో సోలార్ విద్యుత్ 74 మెగా వాట్లు ఉండగా, ఇప్పుడు 5 వేల 600 మెగా వాట్లకు చేరిందన్న రేవంత్ రెడ్డి, అందులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది కేవలం ఒక మెగా వాట్ మాత్రమేనన్నారు. మిగతాదంతా ప్రైవేట్ వాళ్లు, కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ ఇచ్చారో నిజ నిర్ధారణ కోసం అఖిలపక్ష కమిటీ వేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సబ్ స్టేషన్ల వారీగా లాగ్ బుక్కులు తీసి వాస్తవాలను తేలుద్దామన్నారు.