కేసీఆర్ ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ కు సినిమా స్టార్ట్ అవుతుంది: మాజీ మంత్రి కేటీఆర్

KTR: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని సమీక్షించుకుని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Courtesy: Top Indian News

Share:

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని సమీక్షించుకుని, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మొత్తం స్థానాల్లో 14 చోట్ల వందల్లోనే మన మెజార్టీ తగ్గిందన్నారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజమని, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు . తెలంగాణ భవన్ లో శుక్రవారం భవనగిరి లోక్ సభ స్థానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 

పరిపాలనపై అతి శ్రద్ధతో పార్టీపై ద్రుష్టి పెట్టనందుకే ఓడామని.. అందుకు పూర్తి బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని.. ప్రజలు తప్పుచేశారడనం సరికాదన్నారు. రెండుసార్లు మనల్ని గెలిపించింది కూడా ప్రజలేనని, మొత్తం స్థానాల్లో 14 చోట్ల వందల్లో మాత్రమే మన మెజార్టీ తగ్గిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని సమీక్షించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయామని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా మారి పార్టీని నడపడం సరికాదని సూచించారు. 

ఈ పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి పట్టించుకోలేదని అన్నారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే, కళ్లు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుందని ఫైర్ అయ్యారు. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయిందని, కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి దిగితే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో గత పదేళ్లలో 6 లక్షల రేషన్‌ కార్డులు ఇచ్చినా.. ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లలేకపోయామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 15 వేల కొత్త పెన్షన్‌లు ఇచ్చిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనని.. అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాటం చేయాలని నేతలకు కేటీఆర్ సూచించారు. దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వాళ్లు ఓపిక పట్టలేకపోయారని, వాళ్లంతా అసహనంతో మనకు వ్యతిరేకం అయ్యారన్నారు.