ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన.. షర్మిల వెంటే తాను కూడా!

Alla Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు వెళ్లేది నిజమైతే తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెల్లడించారు.

Courtesy: x

Share:

మంగళగిరి:  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌కు వెళ్లేది నిజమైతే తానూ ఆమె వెంటే నడుస్తానని ఇటీవల ఎమ్మెల్యే పదవికి, వైకాపా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెల్లడించారు. మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నన్ను పొమ్మన లేక పొగపెట్టారు. మంగళగిరి అభివృద్ధికి రూ.1,250 కోట్లు ఇస్తామన్నారు. కనీసం రూ.120 కోట్లు కూడా ఇవ్వలేదు. మంగళగిరిలో అభివృద్ధి పనులకు నా సొంత నిధులు ఖర్చు చేశా. వైకాపా ప్రభుత్వం అవినీతి బయటకు రాగానే కోర్టుల్లో కూడా కేసు వేస్తా. షర్మిల కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది.. షర్మిలతోనే నడుస్తానని చెప్పా’’ అని తెలిపారు.

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇటీవల తన పదవికి రాజనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్లో ఆయన తన రాజీనామాను సమర్పించారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారనే కారణాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొనలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు లేఖలో తెలిపారు. ఆర్కే రాజీనామాతో వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాలకు, రాజకీయాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గానికి రూ.1,250 కోట్ల నిధులను మంజురు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినప్పటికీ... ఇంత వరకు నిధులను విడుదల చేయలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోడంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి పొలిటికల్‌ హీట్‌ పెంచారు.