విమాన ప్రయాణికులకు షాకిచ్చిన ఇండిగో.. సీట్ల ఎంపిక ఛార్జీలు పెంపు!

Indigo : భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది.

Courtesy: Top Indian news

Share:

దిల్లీ: భారతదేశంలో అతిపెద్ద విమానయన సంస్థ అయిన ఇండిగో తమ ప్రయాణికులకు షాకిచ్చింది. తమ విమానాల్లో సీటు ఎంపిక ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో రూ.150 నుంచి రూ.1500గా ఉన్న సీటు ఎంపిక ఛార్జీలను, ప్రస్తుతం రూ.150 నుంచి రూ.2,000 వరకు పెంచేసింది.  ఇండిగో విమానాల్లో ఎక్కువ లెగ్‌ రూమ్‌ ఉండే ముందు సీట్ల ఎంపిక కోసం ఏకంగా రూ.2,000 వరకూ అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఛార్జీలను పెంచుతూ విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.

వివిధ సేవలకు పెరిగిన ఛార్జీలకు సంబంధించిన వివరాలను ఇండిగో సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం.. 232 సీట్లు ఉన్న ఎయిర్‌బస్‌ ఏ321 విమానంలో ముందు వరుస విండో సీటు లేదా ‘నడవా సీటు (Aisle seat)’  కోసం రూ.2,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మధ్య సీటు కోసమైతే రూ.1,500 వరకు వసూలు చేస్తారు. అదే 222 సీట్లు కలిగిన ఏ321, 186 సీట్లు ఉన్న ఏ320, 180 సీట్లు ఉండే ఏ320 విమానాల్లో కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. ఇక ఏటీఆర్ విమానాల్లో సీట్లను ఎంచుకునేందుకు అదనంగా రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ ఛార్జీల పెంపును ఏవియేషన్ విశ్లేషకులు అమేయ జోషి ధృవీకరించారు. ‘విమానంలో అదనపు లెగ్‌రూమ్‌తో ముందు వరుస సీట్ల ఎంపిక ఛార్జీని ఇండిగో గరిష్టంగా రూ.2000 వరకు పెంచింది. గతంలో ఇది రూ.1500గా ఉండేది’ అని తెలిపారు. కాగా సీట్ల ఎంపిక ఛార్జీల పెంపుపై ఇండిగో ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో (IndiGo) ఇటీవలే ప్రకటించింది. దీంతో టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ.300 మేర తగ్గాయి. కొన్ని సుదూర మార్గాల్లో అయితే రూ.1,000 వరకు తగ్గినట్లు సమాచారం. 

సాధారణంగా విమానాల్లో అదనపు ఫీచర్లతో కూడిన సీట్లను ఎంచుకునే అవకాశాలను ప్రయాణికులకు కల్పిస్తారు. ఇందుకుగాను వారి నుంచి విమానయాన సంస్థలు ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. దీనిని విమానయాన సంస్థలు ఆదాయ ఉత్పత్తిగా వినియోగించుకుంటున్నాయి.