సరికొత్తగా నూతన సంవత్సరానికి స్వాగతం.. ISRO ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతం

ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్‌) అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది.

Courtesy: x

Share:

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) విజయ దరహాసంతో నూతన సంవత్సరానికి గొప్పగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్‌) అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో (XPoSat) సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ బయలుదేరింది. 

పీఎస్‌ఎల్‌వీ చివరి దశలో మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనికి ‘పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌ (POEM)’ అని నామకరణం చేశారు. దీంట్లోనే తిరువనంతపురం ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌ కాలేజ్‌ విద్యార్థినులు తయారుచేసిన విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ను ఉంచారు.

ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్‌ తొలి పొలారిమెట్రీ మిషన్‌ కాగా.. ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్‌ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్‌ ఎక్స్‌ రే బైనరీలు, యాక్టివ్‌ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్‌ స్టార్స్‌, నాన్‌ థర్మల్‌ సూపర్‌ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్‌ అధ్యయనం చేయనున్నది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్‌ ఉన్నాయి. పాలీఎక్స్‌ (ఎక్స్‌-కిరణాలలో పొలారిమీటర్‌ పరికరం), ఎక్స్‌-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్‌ (ఎక్స్‌పెక్ట్‌-ఎక్స్‌స్‌పీఈసీటీ)ను అమర్చారు. పాలీఎక్స్‌ను రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేయగా, ఎక్స్‌పెక్ట్‌ను యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌కు చెందిన స్పేస్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుకుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్‌పోశాట్‌ సేకరించనున్నది.

ప్రయోగ లక్ష్యం..
ఎక్స్‌పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనేమనని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు.

ఎక్స్‌పోశాట్‌ జీవితకాలం అయిదేళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్‌ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్‌పోశాట్‌ బహిర్గతం చేస్తుంది.