కొత్త క్రిమినల్ చట్టాలకు లోక్‌సభ ఆమోదం

భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌)ల స్థానంలో కేంద్రం కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను తీసుకువచ్చింది. మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Courtesy: IDL

Share:

దిల్లీ: బ్రిటిష్‌కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్‌ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌)ల స్థానంలో కేంద్రం కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను తీసుకువచ్చింది. మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటింగ్‌ చేపట్టి ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రేపు రాజ్యసభలో ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. 

అంతకుముందు లోక్‌సభలో అమిత్‌ షా మూడు బిల్లులకు సంబంధించి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. "ఈ బిల్లులు న్యాయం చేయడానికి తప్ప, శిక్షించడానికి కాదు. వేగంగా న్యాయం చేయడానికి ఈ బిల్లులు తీసుకొచ్చాం. డిజిటల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సైతం సాక్ష్యంగా పరిగణనలోకి  తీసుకొచ్చాం. వందేళ్ల వరకు ఈ చట్టాలు దేశంలో న్యాయ ప్రక్రియలో ఉపయోగపడతాయి." అని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి స్థానంలో కొత్తగా తీసుకువస్తున్న భారతీయ న్యాయ సంహిత శిక్ష కంటే న్యాయంపై దృష్టి పెడుతుందన్నారు. ప్రతిపాదిత మూడు క్రిమినల్ చట్టాలు ప్రజలను వలసవాద మనస్తత్వం, దాని చిహ్నాల నుంచి విముక్తం చేస్తాయన్నారు. అయితే, బిల్లులపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. కొత్త బిల్లులు ఎవరిపై అయినా చర్యలు తీసుకునేలా అధికారాన్ని పోలీసులకు కల్పిస్తున్నాయన్నారు. దాంతో ప్రజల పౌరహక్కులు, హక్కులకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు దేశంలోని సామాన్య ప్రజలకు వ్యతిరేకమన్నారు.

ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత వీటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను దిగువ సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని కేంద్రం ఆశిస్తోంది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందితే ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి. డిసెంబరు 22 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

పార్లమెంట్‌లో 143 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ కొనసాగుతున్న వేళ ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించడం గమనార్హం. పార్లమెంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై చర్చకు పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసిన విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభలో 97, రాజ్యసభలో 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.