మధ్యప్రదేశ్‌లో భాజపా నాయకుడికి బూట్లు తొడిగిన మాజీ సీఎం!

Madhyapradesh : రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పాదరక్షలు ధరించనని శపథం చేసి చివరకు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో బూట్లు ధరించారు. ఆయనే మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లా భారతీయ జనతా పార్టీ చీఫ్ రాందాస్ పూరి.

Courtesy: IDL

Share:

మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నాయకుడు వినూత్న చర్యతో అందరి ద్రుష్టిని ఆకర్షించాడు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పాదరక్షలు ధరించనని శపథం చేసి చివరకు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో బూట్లు ధరించారు. ఆయనే మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లా భారతీయ జనతా పార్టీ చీఫ్ రాందాస్ పూరి. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆయన ఎట్టకేలకు శపథాన్ని నెరవేర్చుకున్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఆయన షూ ధరించారు. దీనికి సంబంధించిన వీడియోను చౌహాన్ షేర్ చేశారు. 


వివరాల్లోకి వెళ్తే, అనుప్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాందాస్ పూరీ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక నిర్ణయం తీసుకున్నాడు. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కాళ్లకు చెప్పులు లేదు బూట్లు ధరించనని 2017లో ప్రతిజ్ఞ చేశాడు. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అయితే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే రాందాస్ పూరీ తన మాటకు కట్టుబడి ఉన్నాడు. సొంత మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక పోవడంతో గత ఆరేళ్లుగా కాళ్లకు చెప్పులు లేదా బూట్లు ధరించలేదు. పార్టీ సమావేశాల్లో కూడా అలాగే పాల్గొనేవాడు. మరోవైపు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అనుప్పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాందాస్ పూరీ తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. శనివారం మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సమక్షంలో తన కాళ్లకు బూట్లు తొడిగాడు. 

అయితే, ఇందుకు సంబంధించిన వీడియోను శివరాజ్ సింగ్ చౌహాన్‌ ట్విటర్ లో పోస్ట్‌ చేసి ఈ విధంగా పేర్కొన్నారు. "రాందాస్ పూరి లాంటి కార్యకర్తలే మా పార్టీకి బలం, మూలధనం. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే వరకు చెప్పులు, బూట్లు ధరించబోనని అనుప్పూర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రాందాస్ పూరీ ప్రతిజ్ఞ చేశారు. ఆయన తీసుకున్న శపథానికి కట్టుబడి ఉన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడింది. వారి ఆకాంక్ష నెరవేరింది. కాబట్టి ఈరోజు వారికి పాదరక్షలు కట్టించాం. అటువంటి అంకితభావం మరియు కష్టపడి పనిచేసే కార్యకర్తలను చూసి భాజపా కుటుంబం గర్విస్తోంది." అని రాసుకొచ్చారు. కాగా, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.